Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ తో దోస్తీపై విమర్శలు: చంద్రబాబుకు జగన్ కౌంటర్ వ్యూహం

జగన్ తో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలిసిన తర్వాత చంద్రబాబు సెంటిమెంటును వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపారని ఆయన అంటున్నారు.

YSRCP counter to Chandrababu's criticism
Author
Amaravathi, First Published Jan 21, 2019, 1:40 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుతో దోస్తీ చేయడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే వ్యూహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. కేసీఆర్ తో దోస్తీ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేయాలని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు సూచించిన విషయం తెలిసిందే.

జగన్ తో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలిసిన తర్వాత చంద్రబాబు సెంటిమెంటును వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపారని ఆయన అంటున్నారు. ఈ విమర్శపై తొలుత ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిన వైసిపి ఆ తర్వాత కౌంటర్ వ్యూహాన్ని రూపొందించుకుని అమలు చేస్తోంది.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు పొత్తుల తీరును ప్రశ్నించాలని వైసిపి నిర్ణయించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో కేసీఆర్ మాత్రమే కాకుండా ప్రస్తుత తెలంగాణ జనసమితి (టీజెఎస్) అధినేత కోదండరామ్ కూడా తీవ్రమైన వ్యాఖ్యలే చేశారని, కోదండరామ్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు తమను విమర్శించే హక్కు ఎక్కడదని వైసిపి నేతలు అంటున్నారు. 

కేసీఆర్ తో జగన్ దోస్తీని బొండా ఉమామహేశ్వర రావు ఓ టీవీ చానెల్ చర్చలో ప్రస్తావించినప్పుడు వైసిపి నేత కోదండరామ్ తో టీడీపి పొత్తు పెట్టుకోవడాన్ని ప్రస్తావించారు. దానికి బొండా ఉమామహేశ్వర రావు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. అంతేకాకుండా, చంద్రబాబును లెక్కకు మిక్కిలిగా విమర్శించిన గాయకుడు గద్దర్ ను చంద్రబాబు ఆలింగనం చేసుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించాలని వైసిపి నిర్ణయించుకుంది. 

తెలంగాణ కాంగ్రెసు నేతలు కూడా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును తిట్టడంలో ఏ మాత్రం తక్కువ తినలేదనే విషయాన్ని కూడా వారు లేవనెత్త దలుచుకున్నారు. చంద్రబాబు వారితో పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ తో తాము కలిసి నడిస్తే తప్పేమిటనే రీతిలో వైసిపి నేతలు మాట్లాడదలుచుకున్నారు. 

పైగా, టీఆర్ఎస్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు పొత్తు ఉండదనే విషయాన్ని వైసిపి నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసమే కేసీఆర్ తో చేతులు కలుపుతున్నట్లు కూడా చెబుతున్నారు. ఎపికి ప్రత్యేక హోదా సాధించడానికి తన ఎంపీలతో సహకరిస్తానని కేసీఆర్ చెబుతున్నారని, టీఆర్ఎస్ ఎంపీలతో ఎపి ఎంపిలు జతకూడితే పార్లమెంటులో గొంతు పెరుగుతుందని వారంటున్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రత్యేక హోదా సాధించడానికి వీలవుతుందని వారు వాదిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios