Asianet News TeluguAsianet News Telugu

మరికొన్ని గంటల్లో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం: జగన్ అను నేను....

వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్‌ హాజరుకానున్నారు. రాష్ట్రంలోని పలు పార్టీల నేతలకు, సెలబ్రిటీలకు ఫోన్ చేసి స్వయంగా జగన్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. 

ys jaganmohan reddy swearing ceremony today
Author
Vijayawada, First Published May 30, 2019, 8:10 AM IST


అమరావతి : నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిగంటల్లో ప్రమాణ స్వీకారం చేబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌తో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 

వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్‌ హాజరుకానున్నారు. రాష్ట్రంలోని పలు పార్టీల నేతలకు, సెలబ్రిటీలకు ఫోన్ చేసి స్వయంగా జగన్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేలాది మంది నేతలు తరలిరానున్నారు. ఇకపోతే వైఎస్‌ జగన్‌కు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు.  

వారితోపాటుు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేవీపీ రామచంద్రరావు హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ తరఫున ఒక ప్రతినిధి హాజరుకానున్నారు.   

ఇకపోతే వైయస్ జగన్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా బుధవారం విజయవాడ చేరుకున్నారు. బందరు రోడ్డులోని గేట్ వే హోటల్ లో బస చేశారు. బుధవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ దంపతులు కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు.  

 వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు  తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది నేతలు, కార్యకర్తలు విజయవాడకు తరలివచ్చారు. 

జగన్ ప్రమాణస్వీకారానికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 30వేల మంది స్టేడియంలో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. స్టేడియంకు ఆనుకుని బయట భారీగా ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. విజయవాడ పట్టనంలో 14 ప్రాంతాల్లో ప్రజలు వీక్షించేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 

అలాగే స్టేడియంలో ప్రత్యేక గ్యాలరీలను సైతం ఏర్పాటు చేశారు. వైయస్ జగన్ కుటుంబ సభ్యులు, జడ్జిలకు ఒక గ్యాలరీ, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరో గ్యాలరీని కేటాయించారు. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు, ఇతర వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 

ప్రజలను గ్యాలరీతో పాటు స్టేడియం లోపల చుట్టూ ఉండే గ్యాలరీలోను అనుమతిస్తున్నారు. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం కోసం రెండు ప్రధాన స్టేజిలను ఏర్పాటు చేశారు అధికారులు.  

జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది పోలీస్ శాఖ. 5,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. 1,200 మంది ప్రత్యేకించి ట్రాఫిక్ ను మల్లించనున్నారు. 

విజయవాడ వైపు వచ్చే ఇతర భారీ వాహనాలు, ట్రాఫిక్‌ మళ్లింపునకు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్గొండ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. బందోబస్తు ఏర్పాట్లన్నీ సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. 

ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే వీవీఐపీలు, వీఐపీలు, ప్రజలకు సంబంధించి పాస్‌లు ఇచ్చారు. ఆరు గేట్లు ఏర్పాటు చేశారు. ఎఎ 300 మందికి ఎ1 పాస్‌లు 1,000 మందికి ఎ2 పాస్‌లు 2,300 మందికి బి1 పాస్‌లు 500 బి2 పాస్‌లు 500 మందికి, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాకు 300 పాస్‌లు, ఆహ్వానితులకు 7 వేల పాస్‌లు మంజూరు చేశారు. సాధారణ ప్రజలకు ఎటువంటి పాస్‌లు లేకుండానే లోపలికి అనుమతిస్తున్నారు. 

ఆర్‌అండ్‌బి కార్యాలయం ప్రాంతంలో వీఐపీల వాహనాలకు, పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో ప్రత్యేక ఆహ్వానితుల వాహనాలకు, బిషప్‌ అజరయ్య స్కూల్, స్టేట్‌ గెస్ట్‌హౌస్, సీఎస్‌ఐ చర్చి ప్రాంతాల్లో అధికారులు, మీడియా వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్, సిద్ధార్థ ఆర్ట్స్‌ కాలేజీ, సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ మైదానాల్లో సాధారణ ప్రజల వాహనాలకు పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios