Asianet News TeluguAsianet News Telugu

జగన్ సీరియస్: సిఎస్ ఎల్వీ బదిలీ వెనక అసలు ట్విస్ట్

సీఎం జగన్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ సిఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. దాంతో తీవ్రంగా పరిగణించిన వైఎస్ జగన్ ఎల్వీని బదిలీ చేసినట్లు చెబుతున్నారు.

YS Jagan serious: Twist in LV Subrahmaniam transfer
Author
Amaravathi, First Published Nov 5, 2019, 8:15 AM IST

హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యంను తప్పించడం వెనక అసలు విషయం వేరే ఉందని ఉంటున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏకపక్షంగా వ్యవహరించడం, తన ఆదేశాలను కూడా బేఖతారు చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదని చెబుతున్నారు.  

ప్రవీణ్‌ ప్రకాష్‌కు జారీచేసిన నోటీసుల్లో రెండు కారణాలను ఎల్వీ సుబ్రహ్మణ్యం చూపించారు. వాస్తవానికి ఆరెండు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో, ఇతర అధికారులు, సీఎస్‌ ఉన్నప్పుడు తీసుకున్నవే. ఆ నిర్ణయాలు సీఎస్‌కు తెలియకుండా జరిగినవి కావని తెలుస్తోంది.

వైయస్సార్‌ పేరుమీ లైఫ్‌టైం అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ సమావేశానికి ముందు ఎజెండాలో ఎలాంటి అంశాలు పెట్టాలన్నదానిపై జరిగిన సన్నాహక సమావేశంలో సీఎం కార్యాలయ కార్యదర్శులు, చీఫ్‌ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. 

Also Read: కోరి తెచ్చుకున్న వ్యక్తి బదిలీయా.. ఏదో జరిగింది: ఎల్వీ ట్రాన్స్‌ఫర్‌పై పవన్ వ్యాఖ్యలు.

రాష్ట్రంలో సామాజిక సేవ, ఇతరత్రా రంగాల్లో సేవచేసినవారికి ప్రతిభ చూపిన వారికి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా ఈ సమావేశంలో నేరుగా ముఖ్యమంత్రే సిఎస్ గా ఉన్న ఎల్వీకి చెప్పారు. అక్కడ సీఎస్‌ దీనికి అంగీకారం కూడా తెలిపారని సమాచారం. రేపటి క్యాబినెట్‌ అజెండాలో పెడదామని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.. తీరా ప్రవీణ్‌ ప్రకాష్‌ ఫైలు తయారుచేశాక.. ఆర్థిక శాఖ అనుమతి లేదని ఎల్వీకి పంపినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఆర్థికశాఖ అనుమతితో సంబంధం లేకుండా ఫైలును కేబినెట్లోనే పెట్టొచ్చు. ఆతర్వాత ఆ నిర్ణయాన్ని ఆర్థికశాఖతో సమన్వయం చేసుకోవచ్చు. సీఎం ఎదుట ఓకే అని, ఆతర్వాత కొర్రీ పెట్టడం సీఎస్‌పై జగన్ ఆగ్రహానికి దారితీసింది. 

ప్రవీణ్‌ ప్రకాష్‌కు సీఎస్‌జారీచేసిన నోటీసులో మరొక ముఖ్యమైన అంశం గ్రామ న్యాయాలయాలు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రామ న్యాయాలయాలు పెట్టాలని నిర్ణయం. దీనికి సంబంధించి సీఎస్‌ పంపిన ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. అయితే గ్రామ న్యాయాలయాలపై ఏర్పాటుపై మరింతగా పరిశీలన చేద్దామని జగన్ అన్నట్లు తెలుస్తోంది.. 

Also Read: షోకాజ్ నోటీసుల ఎఫెక్ట్: ఎల్వీ బదిలీ, కొత్త సీఎస్ రేసులో వీరే

సీఎం నిర్ణయం మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ దాన్ని నిలిపేశారు. ఎంత ఖర్చు చేస్తున్నాం? ఎన్ని  పెడుతున్నాం? అవి సరిపోతాయా? ఇంకా పెంచాలా? వద్దా? అన్నదానిపై న్యాయశాఖ కార్యదర్శితో సమావేశం పెట్టాలని సీఎం ఆదేశించిన మీదటే ప్రవీణ్‌ ప్రకాష్‌ నిలిపేశారని అంటున్నారు. పై వ్యవహారం అంతా సీఎం, సీఎస్‌ల సమక్షంలోనే జరిగిందని తెలుస్తోంది. అయినా సరే, ఆఫైలును ఎందుకు పంపలేదంటూ సీఎస్‌ పట్టుబట్టారని అంటున్నారు. 

పై రెండు విషయాలను చూస్తే ఆ నిర్ణయాలేవీ సీఎస్‌కు తెలియకుండా తీసుకున్నవి కాదు. అంతేకాక, సీఎస్‌ సమక్షంలోనే ఆయనకు చెప్పే ముఖ్యమంత్రి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పరస్పర విశ్వాసం ఉండాలనే ఆలోచనతో సీఎం దాపరికం లేకుండా నడుచుకున్నారని అన్నారు. 

అదే సమయంలో తన సమక్షంలో, తనకు తెలిసీ ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా సీఎం నిర్ణయాలను సీఎస్‌ కూడా పాటించాల్సి ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా సాంకేతిక అంశాలను చూపించి, ఆ నిర్ణయాలను సవాల్‌ చేసేలా నిలుపుదల చేయడం, సీఎంకు తనకు చెప్పినా సరే.. మళ్లీ అదే సాంకేతిక అంశాలను చూపించి ఏకంగా ముఖ్యమంత్రి కార్యదర్శికి షోకాజ్‌ నోటీసు జారీచేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.

తన ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఏయే శాఖలకు ఏయే అధికారులు ఉండాలి, ఎవరు చురుగ్గా పనిచేస్తారు వంటి అంశాలను పరిశీలించి అందుకు అనుగుణంగా ఉండే అధికారులను నియమించాలని జగన్ ఎల్వీకి పేర్లు కూడా సూచించినట్లు తెలుస్తోంది. అయితే, జగన్ సూచించినవారి పేర్లను ఎల్వీ వారాల తరబడి పెండింగులో పెడుతూ వచ్చారని అంటున్నారు. 

పలానా వ్యక్తిని పలాన స్థానంలో పెట్టాలని సీఎం  నేరుగా చెప్పినా సిఎస్ గా ఉన్న ఎల్వీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. రోజుల తరబడి.. ఐఏఎస్‌ అధికారుల నియామకాలు నిలిచిపోతున్నాయని అంటున్నారు. మొత్తం వ్యవహారంలో సిఎస్ గా ఉన్న ఎల్వీ జగన్ ను బేఖాతరు చేస్తూ వస్తున్నారని, అందుకే బదిలీ వేటు వేయాల్సి వచ్చిందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios