Asianet News TeluguAsianet News Telugu

సస్పెన్స్‌కు చెక్: నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

రాష్ట్రావతరణ దినోత్సవంపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించింది వైఎస్ జగన్ సర్కార్. నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది

YS Jagan Govt to Celebrate AP Formation Day on November 1st
Author
Amaravathi, First Published Oct 21, 2019, 8:46 PM IST

రాష్ట్రావతరణ దినోత్సవంపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించింది వైఎస్ జగన్ సర్కార్. నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.

సోమవారం అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహణపై వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సోవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోను, అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రం నుండి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారిని, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కృషి చేసిన వారిని సత్కరించే రీతిలో ఈ వేడుకలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిఎస్ చెప్పారు.

Also Read:ఇంఛార్జ్ మంత్రుల మార్పు: వ్యూహమా...? డిమోషనా..?, జగన్ వ్యవహారశైలిపై చర్చ

అందుకు అనుగుణంగా అవసరమైన కార్యక్రమాన్ని రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్యోద్యమం, రాష్ట్ర అవతరణకు కృషి చేసిన ప్రముఖులు వారి కుటుంబ సభ్యులను సన్మానించే విధంగా కార్యక్రమాలు రూపొందించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అంతేగాక తెలుగు భాషా సంస్కృతికి విశేష సేవలందించిన వారికి, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచే వారికి అవార్డులు అందించేందుకు అర్హులైన వారి జాబితాను సిద్దం చేయాలని సిఎస్ చెప్పారు.

సాంస్కృతిక కార్యక్రమాల ఎంపికకు ఒక సబ్ కమిటీని, అవార్డులకు జాబితా ఎంపికకు ఒక ఉప కమిటనీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఖరారు చేయాలని సిఎస్ సుబ్రహ్మణ్యం చెప్పారు.

Also Read: ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ జగన్ షాక్: రిటైర్డ్ ఉద్యోగులకు కూడా...

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని దీనిపై అందరు జిల్లా కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.

అదే విధంగా వివిధ హోటలుదారుల సహకారంతో తెలుగు వంటకాలుపై ప్రత్యేక ప్రదర్శన శాలలు ఏర్పాటు చేయాలని సిఎస్ సూచించారు.ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రభుత్వ సలహాదారులు, అధికారులతో సిఎస్ సమీక్షించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, సలహాదారులు జివిడి కృష్ణ మోహన్, సజ్జల రామకృష్టా రెడ్డి, తెలుగు అధికార భాషా సంఘం అద్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్ మోహన్ సింగ్, ముఖ్య కార్యదర్శులు ప్రవీణ్ కుమార్, గోపాల కృష్ణ ద్వివేది, ఎస్.ఎస్.రావత్, సమాచారశాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి, ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios