Asianet News TeluguAsianet News Telugu

ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ జగన్ షాక్: రిటైర్డ్ ఉద్యోగులకు కూడా...

రూ.40 వేల వేతనం దాటిన, నియామక ప్రక్రియలు పూర్తి చేయకుండా సేవలు అందిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అలాగే, రిటైర్డ్ ఉద్యోగుల సేవలకు స్వస్తి చెప్పింది.

YS Jagan Govt gives shock to outsourcing employees
Author
Amaravathi, First Published Oct 20, 2019, 10:04 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఇక పూర్తి విశ్రాంతి లభించనుంది. రిటైర్డ్ ఉద్యోగుల సేవలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందు నుంచి సేవలు అందిస్తున్న వారందరినీ తక్షణమే తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. 

అదే విధంగా మార్చి 31వ తేదీకీ ముందు పేపర్ నోటిఫికేషన్, సంబంధిత నియామక ప్రక్రియక ద్వారా కాకుండా నియమితులైన రూ. 40 వేల పైబడి వేతనం తీసుకుంటున్న కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వైఎస్ జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. దానిపై సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ ఉత్తర్వులు రాష్ట్రస్థాయి నుంచి ప్రారంభించి జిల్లా, డివిజన్,త మండల, గ్రామ స్థాయి కార్యాలయాలతో పాటు కార్పోరేషన్లు, స్వయంపత్రిపత్తి గల సంస్థలకు కూడా వర్తిస్తుంది. దానిపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ నెల 31వ తేదీ లోపు తగిన చర్యలు తీసుకుని సంబంధిత నివేదికలను సాధారణ పరిపాలన శాఖకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేశారు. 

ఆ ఉత్తర్వులను సకాలంలో అమలు చేయకపోతే సంబంధిత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉత్తర్వులో స్పష్టం చేశారు. డిప్యూటీ కార్యదర్శి అంతకన్నా ఎక్కువ హోదా ఉన్న అధికారుల్లో ఎవరైనా ఇప్పటికీ  ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందున్న సీటులోనే ఉంటే వారి సబ్జెక్ట్ మార్చడం గానీ హెడ్ క్వార్టర్స్ లోనే మరో కార్యాలయానికి గానీ పంపించాలని తెలిపారు. మూల వేతనం రూ.56,780 కన్నా ఎక్కువ ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios