Asianet News TeluguAsianet News Telugu

తిత్లీ బాధితులు నీళ్లడిగితే బుల్డోజర్లతో తొక్కిస్తానన్న చంద్రబాబు: జగన్ ఫైర్

 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్ చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం అంటూ ధ్వజమెత్తారు. పెన్షన్ తీసుకోవాలన్నా, రేషన్ కార్డు కావాలన్న లంచం లేకపోతే పని జరగడం లేదని ఆరోపించారు. 

ys jagan fires on ap cm chandrababu naidu
Author
Vizianagaram, First Published Oct 22, 2018, 5:54 PM IST

విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్ చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం అంటూ ధ్వజమెత్తారు. పెన్షన్ తీసుకోవాలన్నా, రేషన్ కార్డు కావాలన్న లంచం లేకపోతే పని జరగడం లేదని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి కనిపించడం లేదన్నారు. 

ప్రతీ గ్రామంలో మంచినీరు దొరకడం లేదు కానీ మద్యం మాత్రం దొరుకుతుందని జగన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని విమర్శించారు. రేషలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి విద్యను బలహీనపరిచారన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చెయ్యకుండా ప్రభుత్వ విద్యను బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. 

ప్రభుత్వ విద్యను బలహీనం చేస్తే నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ స్కూల్స్ లో అడ్మిషన్లు పెరిగి డబ్బు సంపాదించొచ్చని చంద్రబాబు ప్లాన్ అంటూ విరుచుకు పడ్డారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థలు చంద్రబాబు నాయుడుకు బినామీలేనని చెప్పుకొచ్చారు. అలాగే ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చెయ్యకపోగా..ఉన్నఉద్యోగాలను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు.  

జనంసై చంద్రబాబు పన్నుల భారం మోపుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడంలోనూ టీడీపీ సర్కార్ విఫలమైందని దుయ్యబుట్టారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఏడాదికి రూ.30వేలు ముష్టి వేస్తున్నట్లు వేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాను నీరుగార్చింది చంద్రబాబు నాయుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో దారుణమైన పరిపాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చౌక దుకాణాల్లో సరిగ్గా బియ్యం కూడా ఇవ్వడం లేదని దుయ్యబుట్టారు. చంద్రబాబు పాలన అంతా అబద్దాలు మోసాలు తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. 

మరోవైపు తిత్లీ తుఫాన్ ను సైతం చంద్రబాబు నాయుడు రాజకీయం చేశారని ఎద్దేవా చేశారు. తిత్లీ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు చేసింది తక్కువ పబ్లిసిటీ కొండంత చేసుకున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందు నుంచి సమాచారం వస్తున్నా కనీస బాధ్యత లేకుండా చంద్రబాబు ప్రవర్తించారన్నారు. 
తుఫాన్ వస్తుందని తెలిసి ప్రత్యామ్నయా ఏర్పాటు చెయ్యలేదని కనీసం తాగునీరు కూడా అందించలేకపోయారని మండిపడ్డారు. తాగునీరు అడిగితే బుల్డోజర్లతో తొక్కిస్తా అన్నారని జగన్ తెలిపారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రకృతిని హేండిల్ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 

గతంలో హుదూద్ తుఫాన్ వల్ల రూ.65వేల కోట్లు నష్టం వచ్చిందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖరాశారని జగన్ గుర్తు చేశారు. తుఫాన్ నష్టం కేంద్రం ఇవ్వలేదని చెప్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంత ఖర్చుపెట్టావో చెప్పాలని నిలదీశారు. 

హుదూద్ తుఫానుకు చంద్రబాబు 926 కోట్లు ఖర్చుపెట్టినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖరాశారని అందులో కేంద్రం ఇచ్చింది రూ.600కోట్లు అని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు హుదూద్ తుఫాన్ కు ఖర్చుపెట్టింది కేవలం 400 కోట్ల రూపాయలు మాత్రమేనని విమర్శించారు. 

అయితే హుదూద్ తుఫాన్ ను తాను జయించానని కోట్లాది రూపాయల ప్రకటనతో సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. తిత్లీ తుఫాన్ వల్ల రూ. 3,435 కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. ఎంత ఖర్చుపెట్టారని అడిగారు. కేవలం 200 రూపాయల సరుకులిచ్చి చేతులు దులుపుకున్నారని జగన్ అన్నారు. 

తాను శ్రీకాకుళం జిల్లాలో పర్యటించలేదని పదేపేద ప్రశ్నిస్తున్న చంద్రబాబును చూసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదన్నారు. సీఎం నువ్వా నేనా అని నిలదీశారు. ఖజానా నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా అధికార యంత్రాంంగం నీదగ్గర ఉందా నా దగ్గర ఉందా అంటూ ప్రశ్నించారు. అయ్యా ముఖ్యమంత్రిగా చెయ్యాల్సిన బాధ్యత నీదా నాదా అని నిలదీశారు. ప్రతిపక్ష నేతగా తాను పాదయాత్ర చేస్తుంటే తమ పార్టీ నేతలు తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios