Asianet News TeluguAsianet News Telugu

మరో ‘‘సీఐ’’ రచ్చ: అనంతలో దుమారం రేపుతున్న వివాదం

కొద్దిరోజుల క్రితం అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఒక సీఐకి మధ్య జరిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మీసం మేలిస్తూ, తొడగొడుతూ జేసీకి సీఐ సవాల్ విసరాడం ప్రభుత్వ పెద్దల దాకా వెళ్లింది. తాజాగా మరో సీఐ వివాదం జిల్లా పోలీస్ శాఖలో పెద్ద దుమారాన్ని రేపింది. 

war between CI and Constable in anantapur district
Author
Anantapur, First Published Jan 13, 2019, 3:55 PM IST

కొద్దిరోజుల క్రితం అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఒక సీఐకి మధ్య జరిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మీసం మేలిస్తూ, తొడగొడుతూ జేసీకి సీఐ సవాల్ విసరాడం ప్రభుత్వ పెద్దల దాకా వెళ్లింది. తాజాగా మరో సీఐ వివాదం జిల్లా పోలీస్ శాఖలో పెద్ద దుమారాన్ని రేపింది.

వివరాల్లోకి వెళితే కల్యాణదుర్గం పోలీస్ సర్కిల్ పరిథిలోని శెట్టూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న గోవింద నాయక్ నెల రోజుల క్రితం ఏదో పని నిమిత్తం బైక్‌పై కళ్యాణదుర్గం వెళుతూ ఫోన్‌లో మాట్లాడారు. దీనిని గమనించిన పట్టణ సీఐ రవిబాబు అతనిని ఆపి మందలించారు.

దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనను సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు రెండు రోజుల క్రిందట కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. వీఆర్‌కు వెళ్లాలంటూ ఉత్తర్వులు రావడంతో ఆ కానిస్టేబుల్ ఖంగు తిన్నాడు.

వెంటనే తాను చేసిన తప్పేమిటని, భార్యకు అనారోగ్యంగా ఉన్నందు వల్లే ఆసుపత్రికి వెళ్తుండగా ఫోన్ రావడంతో బైకుపై వెళుతూ లిఫ్ట్ చేశానని కానిస్టేబుల్ చెప్పారు. అయినప్పటికీ తన మాట వినకుండా సీఐ దుర్భాషలాడటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు.

దీంతో తన ఆవేదనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో ప్రజాసంఘాలు, దళిత సంఘాలు కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని గోవిందనాయక్‌కు మద్ధతుగా ఆందోళన నిర్వహించాయి.

దళిత, గిరిజన ఉద్యోగులను వేధించడం పోలీస్ అధికారులకు తగదంటూ నిలదీయడంతో పాటు కానిస్టేబుల్‌ను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. డీఎస్పీ సెలవులో ఉన్నందున ఆయన వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని సీఐలు రవిబాబు, శివప్రసాద్ హామీ ఇచ్చారు.

మరోవైపు కానిస్టేబుల్‌కు మద్దతుగా సర్కిల్ పరిధిలో పనిచేస్తోన్న పలువురు కానిస్టేబుళ్లు సామూహిక సెలవులో వెళ్లేందుకు సిద్ధంకాగా, ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు సర్దిచెప్పడంతో వారు ఆ ఆలోచనను విరమించుకున్నారు. సమస్యలు వచ్చినప్పుడు అండగా నిలవాల్సిన అధికారులే వేధింపులకు గురిచేస్తుండటాన్ని సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు.

మీడియా ద్వారా విషయం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లడం, ఆయన దీనిని తీవ్రంగా పరిగణించడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని పోలీస్ వర్గాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి. దీనిపై సీఐ రవిబాబును మీడియా ప్రశ్నించగా... విధి నిర్వహణలో భాగంగా కానిస్టేబుల్ గోవిందనాయక్ దురుసు ప్రవర్తపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. తాను చేసింది తప్పయితే తనపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి విచారణ కోరవచ్చన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios