Asianet News TeluguAsianet News Telugu

ఏమైంది: ఆ ఇద్దరు నేతలకు పవన్ కల్యాణ్ షాక్...?

జనసేన పార్టీలో అప్పుడే రాజకీయ పోరు మెుదలైందా. జనసేన పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ఉన్నట్లుండి మాయమైపోవడానికి కారణాలేంటి. పవన్ తో పొసగక పార్టీకి దూరంగా ఉంటున్నారా. పవన్ వాళ్లని పార్టీకి దూరంగా పెట్టారా..ఇవీ జనసేన పార్టీ కార్యకర్తల మదిని తొలిచి వేస్తున్న ప్రశ్నలు. 

Two leaders sidelined by Pawan Kalyan in Jana Sena
Author
Vijayawada, First Published Nov 16, 2018, 3:15 PM IST

విజయవాడ: జనసేన పార్టీలో అప్పుడే రాజకీయ పోరు మెుదలైందా. జనసేన పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ఉన్నట్లుండి మాయమైపోవడానికి కారణాలేంటి. పవన్ తో పొసగక పార్టీకి దూరంగా ఉంటున్నారా. పవన్ వాళ్లని పార్టీకి దూరంగా పెట్టారా..ఇవీ జనసేన పార్టీ కార్యకర్తల మదిని తొలిచి వేస్తున్న ప్రశ్నలు. 

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెన్నంటి ఉన్న వ్యక్తి ఒకరు కాగా ఇటీవలే పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా ఒక ఛానెల్ నే లీజుకు తీసుకున్న వ్యక్తి మరొకరు. పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో కానీ ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఒకరు లెఫ్ట్ సైడ్ మరోకరు రైట్ సైడ్ ఉండాల్సిందే. అలాంటి ఆ లెఫ్ట్ అండ్ రైట్ లు పది రోజులుగా పవన్ కళ్యాణ్ పక్కన కనుచూపు మేరలో కనబడటం లేదు. వాళ్లిద్దరూ ఎందుకు రావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ మెుదలైంది. 

ఇంతకీ ఆ ఎవరా ఇద్దరు అనుకుంటున్నారా ఇంకెవరు కొద్ది రోజుల క్రితం వరకు పవన్‌కళ్యాణ్‌ చుట్టూ తిరిగిన సీనియర్‌ నేతలు మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్‌లు. వీరిద్దరూ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులు. నిత్యం జనసేనాధిపతి పక్కన జనసైనికుల్లా నిలబడేవారు. 

అయితే కొద్ది రోజులుగా ఈ ఇద్దరు నేతలు పవన్ పక్కన కనిపించడం లేదు. పవన్ పక్కనే కాదు అసలు పార్టీ కార్యక్రమాల్లో కనుచూపు మేరల్లో కానరాడం లేదు. అయితే వీరిద్దరిని పవన్ కళ్యాణ్ కావాలనే దూరం పెట్టారని ప్రచారం జరుగుతుంది. వారిపై పవన్‌ విశ్వాసం కోల్పోవడం వల్లే వారిని పార్టీకి దూరంగా ఉంచారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.  

ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి మాదాసు గంగాధరం. జనసేన పార్టీని ప్రకటించిన తరువాత పవన్‌ చేర్చుకున్న తొలి నాయకుడు మాదాసు గంగాధరం. మాదాసు గంగాధరం గతంలో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు. టీడీపీ హాయాంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు కూడా.

వివాదాలకు దూరంగా ఉండే మాదాసు గంగాధరం ను పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి ఆహ్వానించడంతోపాటు పార్టీలో పెద్దపీట వేశారు. పార్టీలో చేరినప్పటి నుంచి పవన్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. పవన్‌ కూడా మాదాసుకు అంతే ప్రాధాన్యత ఇచ్చారు. 

పవన్‌ ప్రసంగించే సభల్లో వేదికలపై ఆయనకు ముందువరుసలో స్థానం ఉండేది. ప్రతి దానికి ఆయనే సలహాదారుడిగా వ్యవహరించే వారంటే ఎంతటి నమ్మకం ఉందో ఇట్టే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ కు కుడి భుజంలా నీడలా వెన్నంటే ఉండేవారు మాదాసు కూడా.

అయితే ఇటీవల కాలంలో మాదాసుపై పవన్‌ నమ్మకం కోల్పోయారని తెలుస్తోంది. మాదాసు తనతో చర్చించకుండా సీట్ల కేటాయింపుల్లో వేలుపెడుతున్నారని కొందరికి సీట్లిస్తామంటూ హామీలు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిందని టాక్. 

కొంతమందితో టిక్కెట్ల విషయంలో బేరసారాలు ఆడినట్లు వచ్చిన ఆరోపణలు పవన్ దృష్టికి వెళ్లాయి. దాంతో పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి మాదాసు గంగాధరం ను దూరం పెట్టారని ప్రచారం జరుగుతంది. 

ఇకపోతే  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నేత తోట చంద్రశేఖర్‌. ఈయన ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. ఆయనను కూడా పవన్ కళ్యాణ్ దరి చేరనివ్వడం లేదని ప్రచారం. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలోకి చేరిన తర్వాత పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకునేవారట తోట. 

పవన్‌ వాయిస్‌ ప్రజలకు చేరాలనే ఉద్దేశ్యంతో తోట 99టీవీని కొనుగోలు చేసి పార్టీ పట్ల తనకున్న అంకితభావాన్ని నిరూపించుకున్నారు. దీంతో పవన్‌ కూడా ఆయనను బాగానే ఆదరించారు. అయితే ఇటీవల కాలంలో తోట చంద్రశేఖర్ వ్యవహార శైలిపై పవన్ కళ్యాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.  

తోట జనసేన పార్టీలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని టిక్కెట్లు వ్యవహారం, బేరసారాలు, పొత్తుల అంటూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. అందువల్లే పవన్ తోట చంద్రశేఖర్ ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే నవంబర్ 10న తోట చంద్రశేఖర్ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వైసీపీ ప్రధాన కార్యదర్శి,సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భేటీ అయ్యారట.  భేటీ అయి పార్టీల పొత్తులపై చర్చించారు. వైసీపీ, జనసేన కలిసి పనిచేయాలని ప్రతిపాదించారని అక్కడితో ఆగకుండా ఎవరికి ఎన్నిసీట్లు అనేదానిపై కూడా చర్చించేశారట. 

పొత్తులో భాగంగా సీట్ల పంపిణీలో తనదే తుది నిర్ణయం అంటూ విజయసాయిరెడ్డితో చెప్పారట. అయితే పొత్తుల వ్యవహారం కాబట్టి పార్టీ అధినేత దూతగా వచ్చి ఉంటారని భావించిన విజయసాయిరెడ్డి పవన్ తో విషయంపై చర్చించారు. తాను అలాంటి ప్రతిపాదనే తీసుకురాలేదని విజయసాయిరెడ్డికి పవన్ వివరణ ఇచ్చారట. ఈ విషయం బహిర్గతమవ్వడంతో తోటపై ఆగ్రహం వ్యక్తం చేశారట పవన్ కళ్యాణ్.  

అయితే అసెంబ్లీ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పార్టీలోకి వచ్చిన తరువాత మాదాసు, తోటలకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని వారి అనుచరులు వాపోతున్నారు. పవన్‌ కళ్యాణ్ సైతం ఆ ఇద్దరికి ప్రాధాన్యత తగ్గించారని ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ ఏది చెబితే అదే చేస్తున్నారని వాపోతున్నారు. 

ఇకపోతే పవన్ కళ్యాణ్ కు పార్టీ సీనియర్ నేతలైన మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్ లు దాదాపు దూరమయ్యారని ఇక రేపోమాపో పార్టీకూడా మారిపోవడం ఖాయమనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మెుత్తం మీద జనసేనలో అందరికన్నా ముందు చేరిన నాయకులు జనసేనను వీడిపోతున్నారంటూ వస్తున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios