Asianet News TeluguAsianet News Telugu

వైసిపిలో పండుల రవీంద్రబాబుకు సీటు చిక్కులు

దీంతో ఈ మూడు స్థానాల నుంచి పండుల రవీంద్రబాబుకు పోటీ చేసే అవకాశం లేదు. పోనీ అమలాపురం ఎంపీగా పోటీ చేద్దామంటే అది కూడా సాధ్యం కాని పని. ఎందుకంటే అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా చింతా అనురాధ రంగంలో ఉన్నారు.  ఆమెను తప్పించే అవకాశమే లేదు. తూర్పుగోదావరిలో అన్ని దార్లు మూసుకుపోవడంతో ఇక పాయకరావుపేటపై పండుల రవీంద్రబాబు కన్నేసినట్లు తెలుస్తోంది. 
 

Pandula Ravindrababu faces trouble in YCP
Author
Kakinada, First Published Feb 21, 2019, 12:54 PM IST

కాకినాడ: ఇటీవలే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పరిస్థితి గందరగోళంగా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందారు పండుల రవీంద్రబాబు. 

అయితే పార్టీలో నెలకొన్న అసమ్మతి నేపథ్యంలో ఆయన ఇటీవలే వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే పండుల రవీంద్రబాబు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచిపోటీ చేస్తారా లేక పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా అన్న విషయంపై తేల్చుకోలేకపోతున్నారు. 

ఇప్పటికే అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా చింతా అనురాధ బరిలో ఉంటున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. ఆయన గత కొద్దికాలంగా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచే పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

తాను ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తానని పార్లమెంట్ కు పోటీ చెయ్యనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారట. అయితే పాయకరావుపేట నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త గొల్ల బాబూరావు రెడీ అవుతున్నారు. 

పండులకు పాయకరావుపేట నుంచి ఛాన్స్ ఇస్తే గొల్ల బాబూరావుకు హ్యాండిచ్చినట్లేనా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పండుల రవీంద్రబాబు పాయకరావుపేట అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారన్న ప్రచారంతో గొల్లబాబూరావు వర్గీయలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొల్లబాబూరావుకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 

పార్టీనే నమ్ముకుని ఉన్న గొల్లబాబూరావునే అభ్యర్థిగా ప్రకటిస్తే పండుల రవీంద్రబాబును ఎక్కడ నుంచి బరిలో దించుతారా అన్నది సస్పెన్షన్ గా మారింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పండుల రవీంద్రబాబు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలైన రాజోలు, పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఏదో ఒక స్థానం కట్టబెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. 

అయితే ఈ మూడు స్థానాల్లో గతంలో ఓడిపోయిన అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఈ మూడు స్థానాల నుంచి పండుల రవీంద్రబాబుకు పోటీ చేసే అవకాశం లేదు. పోనీ అమలాపురం ఎంపీగా పోటీ చేద్దామంటే అది కూడా సాధ్యం కాని పని. 

ఎందుకంటే అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా చింతా అనురాధ రంగంలో ఉన్నారు.  ఆమెను తప్పించే అవకాశమే లేదు. తూర్పుగోదావరిలో అన్ని దార్లు మూసుకుపోవడంతో ఇక పాయకరావుపేటపై పండుల రవీంద్రబాబు కన్నేసినట్లు తెలుస్తోంది. 

పాయకరావుపేట వైసీపీ సమన్వయకర్త గొల్ల బాబూరావు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో ఆయనకు వైసీపీ అధినాయకత్వం హ్యాండిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెుత్తానికి ఎంపీ పండుల రవీంద్రబాబు వల్ల పాయకరావుపేట వైసీపీ సమన్వయకర్త గొల్లబాబూరావు సీటుకు ఎసరువస్తోందని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios