Asianet News TeluguAsianet News Telugu

శ్రీరామ్ ఎంట్రీ పక్కా: అనంత టీడీపీలో నిమ్మల కిష్టప్ప చిచ్చు

ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో  పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. శ్రీరామ్ రాజకీయ భవితవ్యాన్ని చంద్రబాబునాయుడు చేతిలో పెట్టినట్టుగా సునీత ఇటీవల ప్రకటించారు

nimmala kistappa wants to contest assembly in upcoming elections
Author
Amarapur, First Published Jan 28, 2019, 1:12 PM IST

అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో  పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. శ్రీరామ్ రాజకీయ భవితవ్యాన్ని చంద్రబాబునాయుడు చేతిలో పెట్టినట్టుగా సునీత ఇటీవల ప్రకటించారు. అయితే హిందూపురం ఎంపీ సెగ్మెంట్‌ నుండి శ్రీరామ్‌ బరిలోకి దిగే అవకాశం ఉందని  టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో  ఎంపీ నిమ్మల కిష్టప్ప చేసిన వ్యాఖ్యలు  రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

2014 ఎన్నికల సమయంలో  పరిటాల శ్రీరామ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయస్సు సరిపోలేదు. 2009, 2014 ఎన్నికల్లో రాఫ్తాడు నుండి పరిటాల సునీత టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు కేబినెట్‌లో సునీత మంత్రిగా పనిచేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ కూడ ఎన్నికల బరిలో దిగే అవకాశం లేకపోలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాఫ్తాడు నుండి పరిటాల సునీత మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు.

హిందూపురం పార్లమెంట్ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో  పరిటాల శ్రీరామ్‌ను బరిలోకి దింపాలని యోచనలో పరిటాల కుటుంబం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని వరుసగా ఆ పార్టీ గెలుచుకొంటూ వస్తోంది.ఈ స్థానం నుండి  మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

నిమ్మల కిష్టప్ప గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1999లో చంద్రబాబునాయుడు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.  ఆ తర్వాత కిష్టప్ప హిందూపురం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారు.

హిందూపురం ఎంపీ సెగ్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి గట్టి బలం ఉన్నందున ఈ స్థానంలో శ్రీరామ్ పోటీ చేస్తే  సులభంగా విజయం సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న నిమ్మల కిష్టప్ప  హిందూపురం ఎంపీ స్థానాన్ని వదిలేందుకు సిద్దంగా ఉన్నానని తాజాగా ప్రకటించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబునాయుడు ఆదేశిస్తే తాను అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాననే విషయాన్ని  కిష్టప్ప స్పష్టం చేయడం పరిటాల శ్రీరామ్  హిందూపురం ఎంపీ స్థానం నుండి పోటీ చేయడానికి తనకు అభ్యంతరం లేదనే విషయాన్ని  స్పష్టం చేశారు.

అయితే  పుట్టపర్తి లేదా పెనుకొండ అసెంబ్లీ స్థానాల నుండి తాను పోటీ చేస్తానని నిమ్మల కిష్టప్ప ప్రకటించారు. అవసరమైతే తన కొడుకు శిరీష్ కూడ అసెంబ్లీ బరిలో దిగుతాడని కూడ ప్రకటించారు. గత ఎన్నికల సమయంలోనే  శిరీష్‌కు అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వాలని కిష్టప్ప కోరారు. కానీ, హిందూపురం ఎంపీ టిక్కె్ట్టు మాత్రమే చంద్రబాబునాయుడు కిష్టప్పకు ఇచ్చారు.

ప్రస్తుతం పుట్టపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పెనుకొండ నుండి బీకే పార్థసారథి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం నుండి  గత ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో తక్కువగా టీడీపీకి చెందిన వారు ఉన్నారు. ఈ కోటా కింద పల్లె రఘునాధ్ రెడ్డికి బాబు కేబినెట్‌లో బెర్త్ దక్కింది.

ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలతో అదే జిల్లాకు చెందిన కాలువ శ్రీనివాసులుకు మంత్రి పదవిని ఇచ్చారు. పల్లె రఘునాథ్ రెడ్డిని విప్ పదవిని కట్టబెట్టారు. అయితే బీకే పార్థసారథి కూడ మంత్రివర్గంలో చోటు దక్కలేదని కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత బాబు బుజ్జగించడంతో  ఆయన శాంతించారు.

ఈ తరుణంలో  వీరిద్దరూ కూడ పార్టీలో సీనియర్లు. వీరిలో ఎవరిని తప్పించే పరిస్థితులు ఉండకపోవచ్చు. పార్టీ తప్పనిపరిస్థితుల్లో హిందూపురం  పార్లమెంట్  నియోజకవర్గంలో శ్రీరామ్‌ను బరిలోకి దింపితే  నిమ్మల కిష్టప్పకు ఏ స్థానం నుండి బరిలోకి దింపుతారనే విషయమై స్పష్టత రాలేదు. మరో వైపు తనయుడు శిరీష్‌కు కూడ కిష్టప్ప టిక్కెట్టును అడుగుతున్నారు.అయితే ఈ విషయమై చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకొంటారనే  విషయమై త్వరలోనే తేలనుంది.

సంబంధిత వార్తలు

పరిటాల శ్రీరామ్ ఎంట్రీ: కొడుకు కోసం నిమ్మల కిష్టప్ప సైతం

 


 

Follow Us:
Download App:
  • android
  • ios