Asianet News TeluguAsianet News Telugu

20 మంది అమ్మాయిల్ని మోసం చేసిన నిత్యప్రేమికుడు: పట్టించిన భార్య

భర్త ప్రవర్తనలో తేడా కనిపెట్టిన భార్య, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల సాయంతో అతని గత చరిత్రను తెలుసుకుని షాక్‌కు గురైంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా దోర్నపాడు మండలం అమ్మిరెడ్డినగర్‌కు చెందిన సాల్మన్‌రాజు డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు.

Man Arrested For Cheating Women On Social Media
Author
Nandyal, First Published Mar 20, 2019, 8:34 AM IST

భర్త ప్రవర్తనలో తేడా కనిపెట్టిన భార్య, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల సాయంతో అతని గత చరిత్రను తెలుసుకుని షాక్‌కు గురైంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా దోర్నపాడు మండలం అమ్మిరెడ్డినగర్‌కు చెందిన సాల్మన్‌రాజు డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు.

చెడు వ్యసనాలకు బానిస కావడంతో తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు. దీంతో ఓ ఆర్ఎంపీ వైద్యుని వద్ద కొంతకాలం పనిచేశాడు. సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలను టార్గెట్ చేసిన అతను తన పేరురు రాజ్‌కుమార్, రాజ్, సల్మాన్ ఇలా పేర్లు మార్చుకుంటూ తనకున్న బట్టతలకు విగ్గు పెట్టుకున్నాడు.

మంచి ఫోటోలు దిగుతూ ఫేస్‌బుక్‌లో పెట్టాడు. అందమైన అమ్మాయిలతో ఛాటింగ్ మొదలుపెట్టి.. తనకు సినిమా, రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నట్లు ఫోటోలు సృష్టించి అప్‌లోడ్ చేస్తూ ఎంతోమంది అమ్మాయిలను లోబరచుకున్నాడు.

విషయం తెలుసుకున్న అమ్మాయిలను బ్లాక్‌బెయిల్ చేసి బెదిరించేవాడు. కొంతమంది అమ్మాయిల నుంచి డబ్బులు, నగలు కూడా వసూలు చేసేవాడు. రెండేళ్ల కిందట కర్నూలుకు చెందిన ఓ అమ్మాయి ధైర్యం చేసి సాల్మన్ ‌మోసాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు మరో అమ్మాయితో స్టింగ్ ఆపరేషన్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని జైలుకు పంపారు. కొంతకాలం తర్వాత బెయిల్‌పై విడుదలైనప్పటికీ కుక్క తోక వంకర అన్నట్లు సాల్మన్ బుద్ది మాత్రం మారలేదు.

తాజాగా రాజ్‌కుమార్ అనే పేరుతో నంద్యాలలో ఆర్ఎంపీ వైద్యుని అవతారమెత్తాడు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నమ్మించాడు.

అతని మాయలో పూర్తిగా పడిపోయిన ఆమెను సాల్మన్ లోబరుచుకున్నాడు. 40 రోజుల కిందట కడప జిల్లా మైదుకూరు మండలం శెట్టివారిపల్లెకి ఆమెను తీసుకెళ్లి ఆర్ఎంపీ వైద్యునిగా మకాం పెట్టాడు.

చుట్టుపక్కల వారికి భార్యాభర్తలం అని చెప్పుకొచ్చాడు. కొద్దిరోజుల అనంతరం సాల్మన్ ప్రవర్తనలో మార్పు గమనించిన సదరు వివాహిత... అతని ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా భర్త బండారాన్ని కనుగొంది.

అంతేకాక అతడు గతంలో అరెస్టయిన వీడియోలు, టీవీల్లో వచ్చిన వార్తలను చూసి తాను మోసపోయినట్లు గుర్తించింది. వెంటనే తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించింది.

అప్పటికే కుమార్తె కనిపించడం లేదంటూ వివాహిత తల్లిదండ్రులు నంద్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మైదుకూరు పోలీసుల సాయంతో మంగళవారం రాత్రి సాల్మన్ రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios