Asianet News TeluguAsianet News Telugu

గాజువాకనే హాట్ టాపిక్: పవన్ కల్యాణ్ గెలుస్తారా...

పవన్ గెలుస్తారా....వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి గెలుస్తారా...లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే పళ్లా శ్రీనివాస్ గెలుస్తారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరగుతోంది. పవన్ కళ్యాణ్ కి కలిసొచ్చే అంశాలేంటి...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లక్ ఉందా....తెలుగుదేశం పార్టీకి జరిగిన నష్టం ఏంటి అన్న అంశంపై తెగ చర్చ జరుగుతోంది. 

Hot seat: Will Pawan Kalyan win from Gajuwaka?
Author
Gajuwaka, First Published Apr 18, 2019, 12:43 PM IST

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసినా ఫలితాలు తేలేందుకు మరో నెలరోజులు సమయం ఉంది. దీంతో ఎన్నికల వేడి రోజురోజుకు ఉష్ణోగ్రతలతోపాటే పెరుగుతూ వస్తోంది. ఎవరి విజయవకాశాలపై వారు తమ తమ అంచనాలు వేసేసుకుంటున్నారు. 

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న హాట్ టాపిక్ అంత గాజువాకపైనే. ఎందుకంటే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన గెలుపుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

పవన్ గెలుస్తారా....వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి గెలుస్తారా...లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే పళ్లా శ్రీనివాస్ గెలుస్తారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ జరగుతోంది. పవన్ కళ్యాణ్ కి కలిసొచ్చే అంశాలేంటి...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లక్ ఉందా....తెలుగుదేశం పార్టీకి జరిగిన నష్టం ఏంటి అన్న అంశంపై తెగ చర్చ జరుగుతోంది. 

గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ నడిచింది. అది ఎప్పటి వరకు అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలవనంత వరకు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బరిలో నిలిచారో గాజువాక నియోజకవర్గంలో ఆయా పార్టీలు వేసుకున్న అంచనాలన్నీ పటాపంచెలయ్యాయి. 

గత ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కసితో పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఈ నియోజకవర్గాన్ని చాలా ప్రెస్జేస్ ఇష్యూగా తీసుకుంది. అటు తెలుగుదేశం పార్టీ సైతం సిట్టింగ్ స్థానాన్ని వదులుకోవద్దని మంచి పట్టుదలతో ఉంది. 

మళ్లీ పళ్లా శ్రీనివాస్ నే బరిలోకి దించిన టీడీపీ కాపు సామాజిక వర్గం ఓట్లే లక్ష్యంగా కీలక పావులు కదిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బకొట్టాలనే వ్యూహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డిని తెలుగుదేశం పార్టీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. 

తెలుగుదేశం పార్టీ దెబ్బతో షాక్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమిషాల వ్యవధిలో కోలుకోలేని దెబ్బ కొట్టింది. పళ్లా శ్రీనివాస్ అనుచరుడైన దొడ్డి రమణను తమ పార్టీలోకి తీసుకొచ్చేసింది. ఇకపోతే నియోజకవర్గంలో మరో బలమైన నేత మంత్రి రాజశేఖర్ ను సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. 

మంత్రి రాజశేఖర్ కోసం అటు తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రయత్నించినప్పటికీ ఆయన మాత్రం వైసీపీకి జై కొట్టారు. కార్మికుల్లో మంచి పట్టున్న మంత్రి రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ మాంచి ఊపుమీద ఉంది. పల్లా శ్రీనివాస్ మాత్రం తన పని తాను చేసుకుపోయారని ప్రచారం. 

పళ్లా శ్రీనివాస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారని చివరలో చేతులెత్తేశారని కూడా టాక్ నడుస్తోంది. ప్రధాన పోటీ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్యే ఉందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు సామాజిక వర్గం సైతం దగ్గరైంది. 

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారో ఆ ఓటు బ్యాంక్ కాస్త అటు వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతోంది. 2009లో గాజువాక నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది. అంతేకాదు ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. 

వారి ఓట్లు గంపగుత్తగా జనసేన పార్టీకి పడ్డాయా అన్నదానిపై చర్చ. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులతోపాటు ఇతర సామాజిక వర్గాల ఓటర్లను ఆకర్షించారని టాక్. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపును ప్రభావితం చేసేది కాపు సామాజిక వర్గం ఓటర్లే కావడంతో వారు ఓటు ఎటువైపు మళ్లిందా అన్నదాన్ని ఎవరూ అంచనా వెయ్యలేకపోతున్నారు. 

పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదని, పవన్ గెలిచినా రాజీనామా చేసి మరోక అభ్యర్థిని బరిలోకి దించుతారంటూ ప్రచారం ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇంటిని అద్దెకు తీసుకున్నప్పటికీ ఇక్కడ ఉండరని స్థానికుడుని గెలిపించుకోవాలంటూ ఆయా పార్టీలు నానా హంగామా చేశాయి. 

అంతేకాదు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా అంతగా సాగలేదు. అనారోగ్యం కారణంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కాస్త ఆలస్యం అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలపడిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. 

ఏది ఏమైనప్పటికీ గాజువాక నియోజకవర్గంలో గెలుపు మాత్రం అంత ఈజీకాదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు సైతం గెలుపు నల్లేరుపై నడకేమి కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓటరు నాడి పట్టుకోవడం అంత సులభంగా లేదని తెలుస్తోంది. 

తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికే పరిమితమవుతుందని మాత్రం కచ్చితంగా చెప్తున్నారు. పోటీ మాత్రం జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటుందని నియోజకవర్గ వాసులు చెప్తున్నారు. అయితే ఓటరు దేవుళ్లు తీర్పు ఎలా ఇచ్చారో అనేది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.   
 

Follow Us:
Download App:
  • android
  • ios