Asianet News TeluguAsianet News Telugu

బోటు వెలికితీతలో పురోగతి: కచ్చులూరులో లంగర్‌కు చిక్కిన రెయిలింగ్‌

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనుల్లో పురోగతి కనిపించింది. గురువారం ధర్మాడి సత్యం బృందం నదిలో వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ తగిలింది. దానిని రోప్ సాయంతో లాగినప్పుడు రెయిలింగ్ ఊడి వచ్చింది

Godavari boat capsize: operation royal vasista extraction operation updates
Author
Devipatnam, First Published Oct 18, 2019, 10:23 AM IST

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనుల్లో పురోగతి కనిపించింది. గురువారం ధర్మాడి సత్యం బృందం నదిలో వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ తగిలింది. దానిని రోప్ సాయంతో లాగినప్పుడు రెయిలింగ్ ఊడి వచ్చింది.

గురువారం బోటు గాలింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టుకు చెందిన సీనియర్ అధికారి కెప్టెన్ ఆదినారాయణ.. సత్యం బృందంతో కలిసి బోటు మునిగిన చోటుకు నాటు పడవతో వెళ్లారు.

అంచనా వేసిన ప్రదేశం దగ్గర లంగర్‌ వేసి పలు సూచనలు చేశారు. అనంతరం తాడును గోదావరి బయటకు తీసుకొచ్చి ప్రొక్లెయిన్‌తో లాగారు. ఈ క్రమంలో బోటు ముందు భాగంలో ఉండే రెయిలింగ్ ఊడిపోయి పైకి రావడంతో గాలింపు సిబ్బంది, ధర్మాడి సత్యం బృందంలో ఆశలు చిగురించాయి.

రెయిలింగ్ చిక్కిన దానిని బట్టి బోటు ఎడమ వైపుకు పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. బోటును లాగుతున్న సమయంలో డీజిల్ మరకలు తెట్టుగా పైకి వచ్చాయని ఆ ప్రాంతంలో ఎక్కువగా బుడగలు వస్తున్నాయని .. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో బోటును బయటకు తీసే అవకాశం ఉందని ధర్మాడి సత్యం ఆశాభావం వ్యక్తం చేశారు. 

గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో వెలికీతత పనులకు అవకాశం ఇవ్వాల్సిందిగా ధర్మాడి సత్యం ప్రభుత్వాన్ని కోరాడు. దీనికి అంగీకరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సామాగ్రిని కచ్చులూరు వద్దకు తరలించుకోవచ్చని తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం మొదటి విడతలో వేసిన లంగర్‌ కంటే పెద్ద లంగర్‌ను వేసింది.

మొదటి విడతలో లంగర్‌కు ఏదో ఇనుప వస్తువు తగిలినట్లు భావించి.. దానిని ప్రొక్లెయిన్ సాయంతో బయటు లాగేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఇనుప రోప్ తెగిపోవడంతో దానిని విరమించుకున్నారు. 

గత నెల 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో  మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో పాపికొండలు వెళ్తున్నరాయల్ వశిష్ట బోటు మునిగిపోయింది.

ఈ బోటులో ప్రయాణీస్తున్న 38 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 13 మృతదేహాలు ఇంకా వెలికితీయాల్సి ఉంది. ఈ ప్రమాదం నుండి సుమారు 26 మంది సురక్షితంగా బయటపడ్డారు.

ఈ బోటును వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నాలు చేశాయి. చివరికి రాష్ట్ర ప్రభుత్వం  ధర్మాడి సత్యం బృందానికి  రూ. 22 లక్షలకు టెండర్ ను ఇచ్చింది.

గత నెల చివరి వారంలో  మూడు రోజుల పాటు ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా  గోదావరి  నదిలో  బోటు వెలికితీసేందుకు ఆటంకం ఏర్పడింది. దీంతో వరద తగ్గే వరకు బోటు వెలికితీసే పనులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టింది.దీంతో  ఈ నది నుండి బోటును వెలికితీసేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ  అనుమతి మేరకు బోటు వెలికితీసే ప్రయత్నాలను ప్రారంభించారు.

రాయల్ వశిష్ట బోటులో ప్రయాణం చేసి ఆచూకీ లేకుండా పోయిన వారు మృతి చెందినట్టుగానే డెత్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని కూడ ఏర్పాటు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios