Asianet News TeluguAsianet News Telugu

నాలుక కోస్తానంటూ జేసీకి అప్పుడు వార్నింగ్: ఇక పొలిటికల్ వార్

టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తానంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరంట్ల సీఐ మాధవ్ త్వరలో రాజకీయ ఆరంగేట్రం చెయ్యబోతున్నారా..?జేసీకి వార్నింగ్ ఇచ్చి ఒక్క అనంతపురంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మాధవ్ ఇక రాజకీయాల్లోనూ అంతే గుర్తింపు సాధించుకోవాలని భావిస్తున్నారా..?

CI Madhav may enter into politics
Author
Ananthapuram, First Published Dec 28, 2018, 11:43 AM IST

అనంతపురం: టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తానంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరంట్ల సీఐ మాధవ్ త్వరలో రాజకీయ ఆరంగేట్రం చెయ్యబోతున్నారా..?జేసీకి వార్నింగ్ ఇచ్చి ఒక్క అనంతపురంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మాధవ్ ఇక రాజకీయాల్లోనూ అంతే గుర్తింపు సాధించుకోవాలని భావిస్తున్నారా..?

జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న నేపథ్యంలో వైసీపీలో చేరాలని భావిస్తున్నారా..?అసలు మాధవ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా..?రాజకీయ పార్టీలే ఆఫర్లు ఇస్తూ ఆహ్వానిస్తున్నాయా..?మాధవ్ రాజకీయ వార్తల వెనుక అసలు కథేంటి ఓసారి చూద్దాం. 

అనంతపురం రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్నదమ్ములు నోరు విప్పితే వివాదాలే. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం చాలా కష్టం. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జేసీ బ్రదర్స్ కు అనంతపురంలో తిరుగులేదు అనేంత స్థాయికి చేరుకున్నారు. 

6 సార్లు తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, ప్రస్తుతం అనంతపురం ఎంపీగా కొనసాగుతున్న జేసీకి ఇటీవల కాలంలో ఓ సీఐ గట్టి షాక్ ఇచ్చారు. నాలుక కోస్తానంటూ వార్నింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. 

జేసీపై కామెంట్లతో గుర్తింపు పొందిన మాధవ్ తో ఆయన వర్గానికి చెక్ పెట్టాలని వైఎస్ జగన్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీపై మీసం తిప్పిన పోలీసు అధికారిని రంగంలోకి దింపాలని భావిస్తోంది.    

ఇకపోతే అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించేవారు తక్కువనే చెప్పాలి. జగన్ కు ఆది నుంచి ప్రత్యర్థివర్గంగా ఉన్న మంత్రి పరిటాల సునీతకానీ ఆయన అనుచరవర్గం కానీ జగన్ పై అంత ఘాటుగా విమర్శించిన దాఖలాలు లేవు. 

కానీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో తిక్కనాకొడుకు అంటూ తిడుతూనే మావాడు అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు గత ఎన్నికల్లో పోటీ చెయ్యాలని అడిగితే తనను డబ్బులు అడిగాడంటూ చెప్పుకొచ్చారు. 

ఇలా జేసీ దివాకర్ రెడ్డి వైఎస్ జగన్ విషయంలో కొరకరాని కొయ్యగా మారాడు. ఈ నేపథ్యంలో ఎంపీ జేసీకి పబ్లిక్ గా ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన సీఐ మాధవ్ కు వైసీపీయే బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. హిందూపురం నుంచి మాధవ్ ను పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దించాలని వైసీపీ శ్రేణులు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం హిందూపురం వైసీపీ పార్లమెంటు సమన్వయకర్తగా నదీమ్ ఉన్నారు. అయితే నదీమ్ ను అసెంబ్లీ స్థానానికి మార్చి ఆ స్థానంలో పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ ని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే అంశంపై వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారట. 

సీఐ మాధవ్ బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికావడంతో బీసీల జిల్లాగా పేరున్న అనంతలో పార్టీకి మరింత ప్లస్ అవుతోందని వైసీపీ భావిస్తోంది. అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఓ నియోజకవర్గ సమన్వయకర్త సైతం మాధవ్ ని అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గానికి సమన్వయకర్తగా ప్రకటించి ఎన్నికల బరిలోకి దించాలని సూచిస్తున్నారట.  

ఇప్పటికే వైసీపీకి చెందిన కీలక నేతలు సీఐ మాధవ్ తో చర్చించినట్లు తెలుస్తోంది. పోటీకి మాధవ్ సైతం సై అన్నట్లు సమాచారం. పోలీసు వర్గాలు సైతం మాధవ్ కు సహకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి ఘటన తర్వాత పోలీసు వర్గాల్లో జేసీపై ఉన్న వ్యతిరేకత బయటపడింది. 

ఈ నేపథ్యంలో తమ వర్గానికి చెందిన మాధవ్ రాజకీయాల్లో నిలబడటాన్ని పోలీసులు సైతం స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది. మెుత్తానికి మాధవ్ రాజకీయ ఆరంగేట్రంపై స్పష్టమైన క్లారిటీ రావాలంటే మరికొద్దిరోజులపాటు వేచి చూడాల్సిందే. 

ఇకపోతే సీఐ మాధవ్, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిల మధ్య వివాదం ఎలా మెుదలయ్యిందో ఎందుకు జేసీ చీవాట్లు తినాల్సి వచ్చిందో ఓ సారి చూద్దాం. అనంతపురం తాడిపత్రిలోని ప్రబోధానంద స్వామి ఆశ్రమం విషయంలో పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. 

తాడిపత్రిలో ప్రబోధానంద ఆశ్రమవాసులు తమ వర్గీయుల పై దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు కనీసం అడ్డుకోలేదంటూ ఆరోపించారు. అంతటితో ఆగకుండా పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అనంతపురం పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి హోదాలో గోరంట్ల సీఐ మాధవ్ వార్నింగ్ ఇచ్చారు. తమ సొంత మైలేజీ కోసం పోలీసులను చులకన చేసి మాట్లాడితే నాలుక కోస్తానంటూ హెచ్చరించారు. 

ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇదోక అలవాటుగా మారిందని, ప్రతి విషయంలోనూ పోలీసుల మీద నోరుపారేసుకోవడం సహజంగా మారిపోయిందంటూ విరుచుకుపడ్డారు. ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా అంటూ మీసం మెలేసి మరీ వార్నింగ్ ఇచ్చారు సీఐ.  
 
తాము రాజకీయ నాయకుల కొమ్ము కాయడానికి ఈ ఉద్యోగంలోకి రాలేదని జేసీకి స్పష్టం చేశారు. అసభ్యపదజాలంతో తామూ మాట్లాడగలమని తాము రాయలసీమ వాళ్లమేనని చెప్పుకొచ్చారు. టంగ్ స్లిప్ అయితే నాలుక కోస్తా అంటూ ఆ సందర్భంలో వార్నింగ్ ఇచ్చిన సీఐ మాధవ్ తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios