Asianet News TeluguAsianet News Telugu

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

 ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని ప్రకటించిన చంద్రబాబునాయుడు ఆ దిశగా ఇప్పటికే కసరత్తును మొదలు పెట్టారు. 

chandrababu ready to announce 50 candidates name for upcoming elections
Author
Amaravathi, First Published Dec 20, 2018, 11:09 AM IST

అమరావతి: ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని ప్రకటించిన చంద్రబాబునాయుడు ఆ దిశగా ఇప్పటికే కసరత్తును మొదలు పెట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 నుండి 50 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పటికే సిద్దం చేశారు. మిగిలిన అభ్యర్థులపై బాబు కసరత్తు చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్టు కేటాయించాలని భావిస్తున్న చంద్రబాబునాయుడు సిట్టింగ్‌ల్లో కొందరికి మొండిచేయి చూపే అవకాశం కన్పిస్తోంది.

పనితీరు బాగా లేని నియోజకవర్గ ఇంచార్జీలతో పాటు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ దఫా చంద్రబాబునాయుడు మొండిచేయి చూపే అవకాశం లేకపోలేదు. గెలుపు గుర్రాలుగా భావిస్తున్న సుమారు 40 నుండి 50 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబునాయుడు ఇప్పటికే సిద్దం చేశారు.

మాజీ మంత్రులు, మంత్రులకు కూడ ఈ దఫా టిక్కెట్లు దక్కకపోవచ్చు. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా టిక్కెట్ల కేటాయింపు విషయమై చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకోనున్నారు.

చిత్తూరులో మాజీ మంత్రికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈ జిల్లాలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని బాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది.దరిమిలా వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు గాను వ్యూహత్మకంగా అడుగులు వేయాలని బాబు భావిస్తున్నారు.

కడప జిల్లా నుండి ఈ దఫా అసెంబ్లీ బరిలోకి దిగాలని ఎంపీ సీఎం రమేష్ భావిస్తున్నారు. ఈ దఫా ఆయన ప్రొద్దుటూరు స్థానం నుండి పోటీకి సిద్దమౌతున్నారు. అయితే ఈ స్థానంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డితో సీఎం రమేష్ కు మధ్య ఇటీవల కాలంలో అగాధం పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రొద్దుటూరు నుండి సీఎం రమేష్ పోటీ చేస్తే వరదరాజులు రెడ్డి సహకరిస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు.

శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు లేదా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బాబు టిక్కెట్టు నిరాకరించే అవకాశం లేకపోలేదు. విశాఖలో ముగ్గురు సిట్టింగ్‌లకు టిక్కెట్టు కేటాయింపు విషయంలో బాబు నిరాసక్తతో ఉన్నారు. వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ దక్కే అవకాశం లేకపోలేదు.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం లేకపోలేదు. దీంతో వారి స్థానంలో కొత్త వారి కోసం బాబు కసరత్తు చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో కూడ మాజీ మంత్రితో పాటు, ఓ సీనియర్ కు కూడ టిక్కెట్టు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.కృష్ణా జిల్లాలో కూడ ఇద్దరు లేదా ముగ్గురి సీట్ల విషయంలో స్పష్టత లేదు. ఈ స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అనంతపురం జిల్లాలోని నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు డౌటే. హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇద్దరికి, అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇద్దరికి సీట్ల దక్కకపోవచ్చు. వారి స్థానాల్లో కొత్త వారికి టిక్కెట్లను కేటాయించాలని బాబు భావిస్తున్నారు.

గుంటూరు సిటీలో ఓ ఎమ్మెల్యే పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. గత ఎన్నికల్లో ఆయనకు చివరి నిమిషంలో సీటు దక్కింది. ఈ స్థానం నుండి ఆయనకు టిక్కెట్టు ఇవ్వకూడదని పార్టీ నేతలు బహిరంగంగానే కోరుతున్నారు. దరిమిలా ఈ స్థానం విషయంలో బాబు ఏం చేస్తారనేది ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని బాబు ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు నెలకొంది.

సంబంధిత వార్తలు

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

 

 

Follow Us:
Download App:
  • android
  • ios