Asianet News TeluguAsianet News Telugu

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

 వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. జగన్ కేంద్రంగా అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయి. జగన్ పై దాడి రాష్ట్రంలో శాంతి భద్రతల ఎలా ఉన్నాయో అని తెలిపేందుకు నిదర్శనమంటూ వైసీపీ ఆరోపిస్తోంది. 

chandrababu political plan on target bjp over jagan issue
Author
Amaravathi, First Published Oct 26, 2018, 4:00 PM IST

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. జగన్ కేంద్రంగా అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయి. జగన్ పై దాడి రాష్ట్రంలో శాంతి భద్రతల ఎలా ఉన్నాయో అని తెలిపేందుకు నిదర్శనమంటూ వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ పై హత్యాయత్నానికి టీడీపీ కుట్ర ఉందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. 

జగన్ పై కత్తితో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అధికార్టీ స్పష్టం చేసింది. దాడులను ఖండిస్తూనే కేంద్రం ఆడిస్తున్నట్లుగానే జగన్ ఆడుతున్నారంటూ మండిపడుతోంది. జగన్ పై కత్తితో దాడి చేసింది ఆయన వీరాభిమాని అంటూ చెప్పుకొచ్చింది. జగన్ పై కత్తితో దాడి ఘటనకు సంబంధించి వైసీపీ చేసిన ఆరోపణలపై మంత్రులు క్యూ కట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మెుదలు కుని ఆదినారాయణ రెడ్డి వరకు వైసీపీ పైనా కేంద్రంపైనా విరుకుపడ్డారు.

అటు బీజేపీ సైతం దాడిని తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసేందుకు అధికార పార్టీ కుట్ర పన్నుతుందంటూ ఆరోపించింది. జగన్ పై దాడి శాంతిభద్రతల వైఫల్యమేనని విమర్శించింది. ఇలా రాజకీయ పార్టీలు జగన్ పై దాడిని అస్త్రంగా చేసుకుని విమర్శలు గుప్పించుకుంటున్నాయి. 

ఇకపోతే ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం జగన్ అస్త్రంగా కేంద్రంపై విరుచుకుపడుతోంది. సినీనటుడు చెప్తున్న ఆపరేషన్ గరుడను టీడీపీ భుజాన ఎత్తుకుంది. ఆపరేషన్ గరుడలో భాగంగానే ప్రతిపక్ష నేతపై దాడి జరిగిందంటూ ఆరోపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని అందులో భాగంగానే ఈ దాడులు అంటూ చెప్పుకొచ్చింది. 

ఏపీపై బీజేపీ కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తోందని టీడీపీ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని చెప్తోంది. అయితే కేంద్రం చేస్తున్న కుట్రలో భాగమే ఆపరేషన్ గరుడ అని సినీనటుడు శివాజీ చెప్తున్నారు. ఆపరేషన్ గరుడలో చెప్పినట్లుగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కోర్టు నోటీసులు వచ్చాయని, అలాగే ఓ ప్రముఖ నేతపై దాడి జరుగుతుందంటూ ఇటీవలే శివాజీ చెప్పారని ఆయన చెప్పినట్లే జగన్ పై దాడి జరిగిందంటూ మెుత్తం ఘటనను కేంద్రంపై నెట్టేస్తోంది ఏపీ సర్కార్. 

ఈ ఆపరేషన్ గరుడలో బీజేపీతోపాటు వైసీపీ, జనసేన, టీఆర్ఎస్ గవర్నర్ లు ఉన్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ పై కత్తి దాడి జరిగిన తర్వాత విశాఖ ఆస్పత్రిలో చూపించుకోకుండా కనీసం పోలీస్ కేసు పెట్టకుండా హైదరాబాద్ వెళ్లడమేంటని అందులో ఏదో కుట్ర దాగి ఉందని అంటున్నారు. 12 గంటలకు దాడి జరిగితే నాలుగు గంటలపాటు సంతోషంగా ఉన్న జగన్ కేంద్రం డైరెక్షన్లో ఆస్పత్రికి వెళ్లారని ఘాటుగా ఆరోపిస్తోంది. 

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తుంటే అందుకు జగన్, పవన్ లు సహకరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే జగన్ హైదరాబాద్ వచ్చిన తర్వాతే ఆస్పత్రికి వెళ్లారని ఈలోగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు ఆందోళనలు చేశారని ఇదంతా ఒక్క పక్కా ప్రణాళికగా జరుగుతోందని టీడీపీ వ్యాఖ్యానిస్తోంది. 

విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగితే కేంద్రమంత్రి సురేష్ ప్రభు స్పందించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. అంత వేగంగా ఎలా స్పందించిందని ప్రశ్నిస్తోంది. అలాగే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జగన్ పై దాడికి సంబంధించి సీఎస్, లేదా సీఎంకు ఫోన్ చెయ్యాలి కానీ నేరుగా డీజీపీకి చెయ్యడమేంటని నిలదీస్తోంది. నరసింహన్ నేరుగా డీజీపీకి ఫోన్ చేసే అధికారం లేదని చెప్తోంది. రాష్ట్రంలో మేమున్నాం మీకెందుకు ఉలుకు అంటూ గవర్నర్ పై ముప్పేట దాడికి దిగింది మంత్రుల బృందం. 

ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉండి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏకు మద్దతు పలికిన జగన్ కు సంబంధించిన దాడిపై కేంద్రం స్పందించడంలో ప్రత్యేక ఆంతర్యం ఏముంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక విమానాశ్రయంలో ఘటన జరిగినప్పుడు ఆ శాఖ కేంద్రమంత్రి స్పందించడం అందులో వింతేమీ కాదని కనీస ధర్మం అంటూ వాదన వినిపిస్తోంది. 

ఇకపోతే కత్తితో దాడి అనేది శాంతిభద్రతల విషయానికి సంబంధించిన అంశం. ఈనేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ గా ఆరాతీసే అధికారం గవర్నర్ కు ఉందని ప్రచారం జరుగుతోంది. ఒక రాష్ట్రానికి బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిపై కత్తితో దాడి జరిగినప్పుడు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుని వాటిని నివారించాలని గవర్నర్ డీజీపీకి సూచించడంలో ఎలాంటి తప్పు లేదని పలువురు చెప్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తుంది. ఏపీలో ఐటీ దాడుల అంశాన్ని కేంద్రంపైనే నెట్టేస్తోంది. అటు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ రావడం కూడా కేంద్రం కుట్ర అంటూ ఆరోపిస్తోంది. విభజన హామీలు అమలు చెయ్యకుండా కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ మండిపడుతోంది. 

ఇప్పుడు సినీనటుడు శివాజీ వెలుగులోకి తెచ్చిన ఆపరేషన్ గరుడను తెరపైకి తెచ్చి దాన్ని అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ గరుడు నిజమనిపిస్తోందంటూ దాన్ని హైప్ చేసే పనిలో పడింది. చంద్రబాబుకు నోటీసులు ఆపరేషన్ గరుడలో భాగమే, జగన్ పై దాడి ఆపరేషన్ గరుడలో భాగమే, త్వరలో చంద్రబాబును కూలదోస్తారు అది కూడా ఆపరేషన్ గరుడలో భాగమే అంటూ ఆరోపిస్తున్న టీడీపీ ఎందుకు ఆపరేషన్ గరుడపై విచారణకు ఆదేశించడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ గరుడను నమ్మాల్సి వస్తోందని చెప్పినప్పుడు ఆ ఆపరేషన్ గరుడలో భాగంగానే రెండు ఘటనలు చోటు చేసుకున్నాయని నిర్ధారించుకున్నప్పుడు ఎందుకు విచారణ వేయడం లేదు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ఎందుకు చేయించడం లేదు. త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోస్తారు అంటూ అది కూడా ఆపరేషన్ గరుడలో భాగమేనంటూ ప్రచారం జరుగుతుంది.

 ప్రభుత్వమే కూలిపోతుందంటున్నప్పుడు ఎందుకు అధికార పార్టీ అప్రమత్తం కావడం లేదు... అంతేకాదు చంద్రబాబు ప్రైవేట్ హెలికాప్టర్ లలో ప్రయాణించొద్దంటూ హెచ్చరించారు కూడా. సీఎం ప్రాణాలకే ముప్పు సంభవిస్తున్నప్పుడు ఎందుకు టీడీపీ విచారణ చేపట్టడం లేదు. ఇలాంటి ప్రశ్నలు సామాన్యుడి మదిని సైతం ప్రశ్నిస్తున్నాయి. అయితే టీడీపీ వీటన్నింటికి ఎలాంటి సమాధానం చెప్తోందో వేచి చూడాలి.  

ఈ వార్తలు కూడా చదవండి

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్ పై దాడి... రంగంలోకి కేంద్ర దర్యాప్తు బృందం

జగన్‌‌పై దాడి: హైకోర్టుకెక్కిన వైసీపీ

ఎపి పోలీసులపై నాకు నమ్మకం లేదు: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

Follow Us:
Download App:
  • android
  • ios