Asianet News TeluguAsianet News Telugu

ఎపిలో పొత్తు: కాంగ్రెసుకు చంద్రబాబు బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభా స్థానాలు, 25 లోకసభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా సీట్ల పంపకాన్ని నిర్ణయించగా, ఎపిలో అతి పెద్ద పార్టీగా తాము సీట్ల పంపకాన్ని నిర్ణయిస్తామని చంద్రబాబు అంటున్నట్లు తెలుస్తోంది. 

Chandrababu offers 25 seats Congress in AP
Author
Amaravathi, First Published Dec 14, 2018, 6:19 PM IST

అమరావతి: కాంగ్రెసుతో పొత్తుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసుకు ఆయన ఇవ్వదలిచిన సీట్ల సంఖ్యను కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభా స్థానాలు, 25 లోకసభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా సీట్ల పంపకాన్ని నిర్ణయించగా, ఎపిలో అతి పెద్ద పార్టీగా తాము సీట్ల పంపకాన్ని నిర్ణయిస్తామని చంద్రబాబు అంటున్నట్లు తెలుస్తోంది. 

అయితే, కాంగ్రెసుకు 25 శాసనసభా స్థానాలను, అరకు పార్లమెంటు సీటును కేటాయించడానికి ఆయన ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, కాంగ్రెసు మాత్రం పది పార్లమెంటు సీట్లు, 30 శాసనసభా స్థానాలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, పట్టుబడితే చంద్రబాబు మరో రెండు లోకసభ స్థానాలు ఇవ్వడానికి ముందుకు రావచ్చునని అంటున్నారు. 

తెలుగుదేశం పార్టీతో పొత్తుపై రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ ఊమెన్ చాందీ రాష్ట్ర నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో అందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెసు నేతలు తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే పార్టీ ఎదగడం కష్టమని వారు చెబుతున్నారు. బిజెపి అనుభవం అదేనని, పైగా బిజెపి రాష్ట్రంలో ఎప్పుడు కూడా అంత బలంగా లేదని, తమ పార్టీ అందుకు భిన్నమని వారు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. 

గత ఎన్నికల్లో 2.5 శాతం ఓట్లు కాంగ్రెసుకు వచ్చాయి. రాష్ట్ర విభజన కారణంగా ప్రజలు ఆ పార్టీని ఆదరించలేదు. దీంతో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు తమకు 6 శాతం దాకా ఓట్ల బలం ఉందని, ఎన్నికల నాటికి మరింత బలపడే అవకాశం ఉందని, ఈసారి కాకున్నా వచ్చే సారైనా అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడమే మంచిదని వారు వాదిస్తున్నట్లు చెబుతున్నారు. 

తెలుగుదేశం పార్టీకి బద్ద వ్యతిరేకి అయిన కెవిపి రామచందర్ రావు కాంగ్రెసు అధిష్టానంలోని నాయకుల్లో ఒక్కరైన అహ్మద్ పటేల్ ను కలిసి తెలుగుదేశంతో పొత్తు వద్దనే విషయాన్ని రాహుల్ గాంధీకి చేరవేయాలని కోరినట్లు తెలుస్తోంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్లనే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు నిరాశాజనకమైన ఫలితాలను చవి చూడాల్సి వచ్చిందని, పొత్తు పెట్టుకుంటే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కూడా మోయాల్సి ఉంటుందని కోస్తాంధ్ర నాయకులు అంటున్నారు. 

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వంటి రాయలసీమ నాయకులు మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అంటున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉన్నందున, దాన్ని నిలువరించాలంటే కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవడం అవసరమని వారు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. 

జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో చంద్రబాబు కలిసి రావడానికి సిద్ధపడ్డారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్రంలో బిజెపిని ఓడించడం అవసరంగా మారింది. దీంతో రాహుల్ గాంధీ చంద్రబాబుతో పొత్తుకే మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అంతేకాకుండా, వైఎస్ జగన్ తెలుగుదేశం, కాంగ్రెసుల ఉమ్మడి శత్రువు కాబట్టి రాహుల్ గాంధీ పొత్తుకే మొగ్గు చూపినా అశ్చర్యం లేదని అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాత్రం తన అభిప్రాయాన్ని కచ్చితంగా చెప్పడం లేదు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని ఆయన అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios