Asianet News TeluguAsianet News Telugu

జాతీయ స్థాయిలో చంద్రబాబు హిట్: ఎపి సంగతేమిటి...

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కూటమికి వేగంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ యేతర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేందుకు, ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు హస్తిన కేంద్రంగా రాజకీయాలు నెరపుతున్నారు. చంద్రబాబు నాయుడు జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటు చెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవాలి. 

Chandrababu hits at national level: What about AP?
Author
Amaravathi, First Published Nov 2, 2018, 11:58 AM IST

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కూటమికి వేగంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ యేతర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేందుకు, ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు హస్తిన కేంద్రంగా రాజకీయాలు నెరపుతున్నారు. చంద్రబాబు నాయుడు జాతీయస్థాయిలో కూటమి ఏర్పాటు చెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవాలి. 

ఎన్డీఏ వన్ ఏర్పాటులో కానీ, అంతకుముదు ఏర్పడిన ఫ్రంట్ లో కానీ చంద్రబాబు నాయుడే కీ రోల్ పోషించడమే అందుకు నిదర్శనం. అయితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నపరిస్థితులు ప్రస్తుతం నవ్యాంధ్రలో నెలకొన్న పరిస్థితులు వేరు. ఆనాటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు మాటే వేదం. పార్టీ పరంగా ఏదైనా కామెంట్ చెయ్యాల్సి వస్తే అది నేరుగా చంద్రబాబు చెయ్యాలి లేదా పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే బహిర్గతం చెయ్యాలి.

కానీ ఆనాటి పరిస్థితులు నేడు లేవు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అంగీకరిస్తూనే కొందరు పార్టీలో స్వతహాగా వ్యవహరిస్తున్నారు. అధినేత మాటలను సైతం ధిక్కరించిన నేతలు ఎందరో ఉన్నారు. అలాగే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణమిచ్చేటంత స్థాయిలో నేతలు ఉన్నారు. 

అలాంటి కరుడు గట్టిన తెలుగుదేశం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై అంగీకరిస్తారా అంటే అంగీకరించని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పుట్టుకే తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడు పోసుకుంది. అలాంటి పార్టీతో పొత్తును పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ ను చంద్రబాబు కలవడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు బాహటంగానే విమర్శించారు. టీడీపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ తో టీడీపీతో పొత్తు అంటే ఒంటికాలిపై లేచారు. అంతేకాదు కాంగ్రెస్ తో టీడీపీ కలిసే ప్రసక్తే లేదని అదే జరిగితే తాను ఉరి వేసుకుంటానని చెప్పారు. 
 
అప్పటికే కాంగ్రెస్ తో పొత్తులపై చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేసిందంటూ ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు నాయుడు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీ చంద్రబాబు భుజం సైతం తట్టారు. 

అప్పటి వరకు రాహుల్ గాంధీని పప్పు, సోనియాగాంధీ ఇటలీ దెయ్యం అంటూ విమర్శించిన చంద్రబాబు, వారితోనే కలవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. చంద్రబాబు కాంగ్రెస్ నేతల కలయిక యాధృచ్చికం అంటూ కొట్టిపారేశారు. 

అప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపెట్టుకుంటుందని వస్తున్న వార్తలపై మరో మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఏమీ ఉండదంటూ ఆగష్టు 23న విశాఖపట్నంలో వ్యాఖ్యానించారు. 

సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తులాంటి పెద్ద తప్పులు చెయ్యరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ అలాంటి తప్పు చేస్తే అంతకంటే పెద్ద తప్పు ఏమీ ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలన్న ఏకైక ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ తో పొత్తు అంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదన్నారు. కాంగ్రెస్ తో పొత్తును తామే కాదు ప్రజలు కూడా క్షమించరని మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

అప్పటికే కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే ఉరివేసుకుంటానన్న కేఈ ఆగష్టు 26న మరో కామెంట్ చేశారు. కర్నూలులో ధర్మపోరాట దీక్ష విజయవంతమైందని చెప్తూ నిర్వహించిన ప్రెస్మీట్ లో ఏపీలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండదని తన వ్యాఖ్యలను సవరించుకున్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. 

అంతేకాదు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అన్న కేఈ ఇతర పార్టీలతో పొత్తులు ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తులపై సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పుకొచ్చారు.

ఇలా కాంగ్రెస్ తో పొత్తుపై ఇద్దరు మంత్రులు బహిరంగంగా వ్యాఖ్యానించడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. పొత్తులపై ఎవరు ఎలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పొత్తులపై వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం కేఈ, మరోమంత్రి అయ్యన్నపాత్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తుల గురించి టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అప్పటి వరకు మాట్లొద్దని ఆదేశించారు.  

టీడీపీ జాతీయ అధ్యక్షుడు హోదాలో చంద్రబాబు పొత్తులపై వ్యాఖ్యానించొద్దని వార్నింగ్ ఇచ్చినా కేఈ కృష్ణమూర్తి వెనక్కితగ్గలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని గుంటూరు జిల్లాలో సెప్టంబర్ 3న స్పష్టం చేశారు. 

ఆ తర్వాత తెలంగాణలో ప్రజాకూటమిలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం కూడా జరిగిపోయింది. కానీ ఈ ఇద్దరు మంత్రులు పెదవి విప్పలేదు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరు ఆంధ్రాలో రాజకీయ పరిస్థితులు వేరు అన్న కోణంలో నేతలు ఆగినా భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు అంటే అంగీకరించే అవకాశం ఉండదని తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోకపోతే తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పొత్తు అనివార్యం కాబట్టి నేతలు అంగీకరించినా ఏపీలో మాత్రం స్వరం మార్చేలా ఉన్నారు. 

ఏపీలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని, వైసీపీ నుంచి వలస వచ్చిన నేతలతో మరింత బలంగా తయారైందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే వలస వచ్చిన నేతలు పార్టీని నమ్ముకుని 30ఏళ్లకు పైగా ఉంటున్న నేతలు ఎవరికి వారే టిక్కెట్లపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ల సర్దుబాటు విషయంలో ఏమైనా తేడా జరిగితే జాతీయ స్థాయిలో చంద్రబాబు ప్లాన్ వర్క్ అవుట్ అయినా ఆంధ్రాలో మాత్రం బెడిసికొట్టే ప్రమాదం ఉందని తెలుస్తోంది. 

ఏపీలో ఉనికి లేని కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటే టీడీపీ నేతలు ఇప్పటికే పెదవి విరుస్తున్నారు. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి కేటాయించాల్సి ఉంటుందని అప్పుడు పార్టీ మరింత ఇరకాటంలో పడే ప్రమాదం ఉందని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. 

ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో సీట్లపై పెద్ద రచ్చే  జరుగుతుంది. వైసీపీ, కాంగ్రెస్, బీజేపీల నుంచి వలస వచ్చిన నేతలతో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మళ్లీ కాంగ్రెస్ తో పొత్తు అంటే తమ సీటుకు ఎక్కడ ఎసరువస్తుందోనని ఇప్పటికే ఆందోళనలో పడ్డారు. జాతీయస్థాయిలో కూటమికి చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నా సొంత రాష్ట్రంలో మాత్రం ఆ అడుగులే తడబాటుకు గురి చేసే అవకాశం లేకపోలేదన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios