Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబును రానిచ్చేది లేదు: శ్రీకాకుళంలో అమిత్‌షా

ఈ దఫా  టీడీపీని ఎన్డీఏలో  చేరకుండా అడ్డుకొంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారు. దేశానికి మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు.
 

bjp national president amith shah slams on chandrababu in srikakulam
Author
Srikakulam, First Published Feb 4, 2019, 1:26 PM IST


శ్రీకాకుళం:  ఈ దఫా  టీడీపీని ఎన్డీఏలో  చేరకుండా అడ్డుకొంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారు. దేశానికి మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తలపెట్టిన బస్సు యాత్రను ప్రారంభించేందుకు అమిత్ షా సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లా పలాసకు వచ్చారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు.

కేంద్రంలో మరోసారి మోడీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ దఫా ఎన్డీఏలో చేరేందుకు బాబు ప్రయత్నిస్తే  తాము అడ్డుకొంటామని ఆయన చెప్పారు.
ఏపీ రాష్ట్రానికి  ఇప్పటికే కేంద్రం 14 కీలకమైన అంశాల్లో 10  అంశాలను  పూర్తి చేసినట్టు  చెప్పారు. ఈ విషయమై చర్చకు సిద్దమా అని ఆయన  బాబును ప్రశ్నించారు.
తెలంగాణ ఎన్నికల్లో  కాంగ్రెస్ ఓటమి పాలైన  తర్వాత  మహా కూటమి అంటూ కొత్త పల్లవిని అందుకొన్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు.

ఏపీ రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలను  ఆయన తప్పుబట్టారు.  కేంద్రంలో  బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.44 లక్షల కోట్లను ఏపీ రాష్ట్రానికి అందించినట్టు ఆయన చెప్పారు.

20 జాతీయ సంస్థలను ఏపీకి ఇచ్చినట్టు అమిత్ షా గుర్తు చేశారు. రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన చంద్రబాబునాయుడు రాయలసీమకు ఎందుకు న్యాయం చేయలేదో చెప్పాలనే ఆయన డిమాండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని హమీ ఇచ్చినప్పటికీ కూడ రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన ప్రతిపాదనలతో  కేంద్రం వద్దకు బాబు రాలేదన్నారు.

 ఏపీలో టీడీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఈ విషయాన్ని గుర్తించి ఎన్డీఏ నుండి తెగదెంపులు చేసుకొన్నారని ఆయన చెప్పారు.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్రలను నిర్వహించనున్నట్టు అమిత్ షా చెప్పారు. టీడీపీ, వైసీపీలు కూడ కుటుంబ పార్టీలని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీలు కూడ అవినీతి పార్టీలని ఆయన చెప్పారు. 

  

Follow Us:
Download App:
  • android
  • ios