Asianet News TeluguAsianet News Telugu

టీడీపీలో నంద్యాల టికెట్ లొల్లి: ఎమ్మెల్యే భూమాకు ఎసరు


ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గం నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సుబ్బారెడ్డి నంద్యాల టికెట్‌ను ఆశిస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అటుు ప్రస్తుత ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సైతం టికెట్ తనదేనని ధీమాగా ఉన్నారు. 

av subbareddy wants to contestant nandyal constituency
Author
Nandyal, First Published Feb 1, 2019, 8:02 PM IST

కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాలు మాంచి హీట్ రప్పిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఏపీలో కర్నూలు జిల్లా రాజకీయమే హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో అంశం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలపై ఆశావాహులు విపరీతంగా ఉన్నారనడంలో ఎలాంటి సందేహమే లేదు. 

అదే పరిస్థితి ఇప్పుడ కర్నూలు జిల్లా నంద్యాలపైనా పడింది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి హఠాత్తుగా తెరపై ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమవుతూనే తన మనసులో కోరిక బయటపెట్టారు. తాను నంద్యాల టిక్కెట్ ఆశిస్తున్నానని చెప్తూనే మరొకరికి ఇచ్చిన సహకరిస్తానని చెప్పడం విశేషం. 

ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గం నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో సుబ్బారెడ్డి నంద్యాల టికెట్‌ను ఆశిస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అటుు ప్రస్తుత ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సైతం టికెట్ తనదేనని ధీమాగా ఉన్నారు. 

దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనని చర్చ జరుగుతోంది. కర్నూలు రాజకీయాల్లో భూమా, ఏవీ కుటుంబాల మధ్య సత్సమసంబంధాలు ఉండేవి. దివంగత నేత భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలు మంచి మిత్రులు. ఇద్దరూ కలిసి కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. 

అయితే భూమా నాగిరెడ్డి మరణానంతరం రెండు కుటుంబాల మధ్య పెద్ద అగాథం చోటు చేసుకుంది. పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ, సుబ్బారెడ్డిలు ఒకే పార్టీలో ఉన్నా రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. విమర్శలు కాస్త కొట్లాట వరకు వెళ్లింది. 

దీంతో ప్రస్తుతం ఇరుకుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ప్రత్యర్థులుగా మారారు. గతంలో టీడీపీ సైకిల్‌ యాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై ప్రత్యర్థులు రాళ్ల దాడికి దిగారు. భూమా వర్గీయులే దాడి చేశారని సుబ్బారెడ్డి ఆరోపించారు. దాడిపై ఆళ్లగడ్డ డీఎస్పీకి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. 

ఆహోబిలానికి చెందిన సంజీవరాయుడు, చింతకుంటకు చెందిన రాముతో పాటు మరో పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి జరిగిన పార్టీ శ్రేయస్సు కోసం సర్దుకుపోతామని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. సుబ్బారెడ్డి దాడి ఘటనను మంత్రి అఖిలప్రియ ఖండించారు. 

ఎవరిపైనా దాడి చేయించాల్సి అవసరం తమకు లేదన్నారు. ఈవివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించడంతో రంగంలోకి దిగిన చంద్రబాబు ఇద్దరిని పిలిపించి సయోధ్య కుదుర్చారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నంద్యాల టికెట్ ఆశిస్తున్నట్లు ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించడం ఆసక్తిగా మారింది. అయితే చంద్రబాబు నంద్యాల టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి ఇస్తారా లేక ఏవీ సుబ్బారెడ్డికి ఇస్తారా అన్నది వేచి చూడాలి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios