Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీలో మరోసారి మోగనున్న సమ్మె సైరన్

నష్టాల పేరుతో ఆర్టీసీ కార్మికులను కుదించడంతోపాటు అద్దె బస్సులను పెంచడాన్ని నిరసిస్తూ సమ్మె నోటీసులు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతో ఈనెల 23 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 
 

aps rtc employees union leaders gives a strike notice to md surendrababu
Author
Vijayawada, First Published May 9, 2019, 12:18 PM IST

విజయవాడ: సమ్మెబాట పట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. తమ న్యాయపరమైన 46 డిమాండ్లు పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెకు దిగుతామంటూ బుధవారం ఎన్ఎంయూ కార్మిక సంస్థ ఆర్టీసీ భవన్ లో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు సమ్మె నోటీస్ ఇచ్చింది. 

తాజాగా ఆర్టీసీ ఎంప్లాయిస్ జేఏసీ సైతం సమ్మె నోటీస్ అందజేసింది. నష్టాల పేరుతో ఆర్టీసీ కార్మికులను కుదించడంతోపాటు అద్దె బస్సులను పెంచడాన్ని నిరసిస్తూ సమ్మె నోటీసులు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతో ఈనెల 23 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 

ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 6న తాము సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నామని అయితే ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పలు హామీలు ఇవ్వడంతో ఆ సమ్మెను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. 

ఫిబ్రవరి 6న ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చెయ్యలేదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆనాడు జరిగిన ఒప్పందంలో భాగంగా 2013 నుంచి చెల్లించాల్సిన ఎరియర్స్ చెల్లిస్తామని ఇచ్చిన 223 కోట్ల రూపాయలు ఇప్పటికీ చెల్లించలేదని కారణాలు అడుగుతుంటే ప్రభుత్వం ఇవ్వడం లేదని సాకులు చెప్తున్నారంటూ మండిపడ్డారు. 

ఉగాది కానుకగా ఇస్తామని చెప్పిన ఎరియర్స్ ఇప్పటికి ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్టీసీ నష్టాలకు కార్మికులకు ఎలాంటి సంబంధం లేదని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీ బలోపేతం కోసం ప్రతీ కార్మికుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. 

నష్టాలు తగ్గించేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సింది పోయి ఉద్యోగులను తగ్గించాలని చూడటం సరికాదన్నారు. ఇప్పటికే రాష్ట్ర విభజన అనంతరం 11 వేల మంది ఉద్యోగులను తొలగించారని, అలాగే ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్న 4వేల మందిని తొలగించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడాన్ని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. 

సమ్మె నివారణ జరగాలంటే సిబ్బంది కుదింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అద్దెబస్సుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శ్రమదోపిడీకి తాము గురవుతున్నా సంస్థ పరిరక్షణ కోసం తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. 

ఆర్టీసీలోని 10 సంఘాలు కలిసి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం నుంచి దాదాపు రూ.700 కోట్లు రావాలని చెప్తోందని ప్రభుత్వం పసుపు-కుంకుమ పథకానికి డబ్బులు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఎందుకు చెల్లించడదని ప్రశ్నించారు. 

ఆర్టీసీ బస్సులో ఇప్పటికే 23 శాతం అద్దెబస్సులు ఉన్నాయని వాటిని తొలగించి వాటి స్థానం ఆర్టీసీ బస్సులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 10 నుంచే సమ్మె సన్నాహక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 

సమ్మె సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 10న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 128 డిపోలతోపాటు 4 వర్క్ షాపులలో సమ్మె సన్నాహ దర్నాలకు పిలుపునిచ్చింది. అలాగే 17,18 తేదీలలో సమ్మె నోటీసుకు సంబంధించి ప్రధాన డిమాండ్లను బ్యాడ్జెస్ రూపంలో తగిలించుకుని విధులకు హాజరుకానున్నట్లు తెలిపారు. 

మే 22 నాటికి 14 రోజులు పూర్తి చేసుకుంటుందని 14 రోజుల తర్వాత సమ్మె చేసే అవకాశం ఉంటుంది కాబట్టి 22న 13 జిల్లాల రీజనల్ కార్యాలయాల వద్ద మహాధర్నా నిర్వహించబోతున్నామని అదే రోజున సమ్మె తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. 

అయితే తమ సమస్యలను ఎండీ సురేంద్రబాబు పరిష్కరిస్తారా లేక వచ్చే నూతన ప్రభుత్వం పరిష్కరిస్తుందో తెలియదు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో సమ్మె తప్పదంటూ హెచ్చరించింది ఆర్టీసీ ఎంప్లాయిస్ జేఏసీ. 
 

Follow Us:
Download App:
  • android
  • ios