Asianet News TeluguAsianet News Telugu

జగన్ వాగ్ధానం చేస్తే అది శాసనమే, చంద్రబాబువి నీచ రాజకీయాలు: మంత్రి బొత్స

మహిళలను కించపరిచేలా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అసభ్య పదజాలంతో అపార అనుభవం ఉన్న చంద్రబాబు బుద్ది గతి తప్పిందా అని ప్రశ్నించారు. 

ap minister botsa satya narayana fires on chandrababu naidu
Author
Amaravathi, First Published Oct 5, 2019, 8:28 PM IST

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై ప్రశంసలు కురిపించారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సీఎం జగన్ వాగ్ఘానం ఇస్తే అది శిలా శాసనమేనని చెప్పుకొచ్చారు. 

లక్ష 73వేల మంది ఆటోకార్మికులకు ఒకే మీట నొక్కి రూ.10 వేలు అందించిన ఘనత జగన్ దేనని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు. 

నలభై ఏళ్ల క్రితం విజయనగరం జిల్లాగా ఏర్పడినప్పుడు ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నామని అయితే మూడు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీకేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అభివృద్దిపై దృష్టి సారించలేదని విమర్శించారు. 

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విజయనగరం జిల్లా అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను మున్సిపాలిటీలుగా మార్చినప్పుడు ఆనందపడ్డాం గానీ, తర్వాత వాటిని ఒక్క జీవోతో రద్దు చేశారని విమర్శించారు. 

గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరగడంతో పట్టణాల్లో జనసాంద్రత పెరుగుతుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ అందుకు తగ్గట్లుగా మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. 

త్వరలో విజయనగరం జిల్లాలో 100 పనులకు ఒకేసారి శంకుస్థాపన జరగనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వెనుకబడిన జిల్లాగా పేరున్న విజయనగరం జిల్లా రూపు రేఖలు మార్చబోతున్నట్లు తెలిపారు. 

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన బొత్స:
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. సోషల్‌ మీడియాలో రాతల గురించి ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. 

అందరి ఇళ్లల్లోనూ మహిళలు ఉంటారని వారిని కించపరుస్తూ మాట్లాడవద్దని హితవు పలికారు.పెయిడ్‌ ఆర్టిస్టులతో డ్రామాలాడడం మానుకోవాలని మాజీ సీఎం చంద్రబాబుకు సూచించారు.

సోషల్ మీడియా నెపంతో చంద్రబాబు నీచ వ్యాఖ్యలతో రాజకీయాలకు దిగుజారుతున్నారని ధ్వజమెత్తారు. పెయిడ్ ఆర్టిస్ట్ ల ద్వారా నీతిమాలిన రాజకీయాలకు చంద్రబాబు దిగారని మండిపడ్డారు. 

మహిళలను కించపరిచేలా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అసభ్య పదజాలంతో అపార అనుభవం ఉన్న చంద్రబాబు బుద్ది గతి తప్పిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలని హితవు పలికారు. మీ బెదిరింపులకు బెదిరేవారు లేరని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios