Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ కేబినెట్ కూర్పు సిద్ధం: 19 మందిలో చోటు దక్కించుకోని రోజా

వైయస్ జగన్ తన కేబినెట్ ను దాదాపుగా ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇప్పటి వరకు 19 మంది మంత్రుల పేర్లను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మిగిలిన 6 మంది పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 
 

ap cm ys jagan's cabinet composition is prepared
Author
Amaravathi, First Published Jun 7, 2019, 6:26 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ కూర్పుపై కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. తన కేబినెట్ లో 25 మందికి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా గత కొన్నిరోజులుగా మంత్రుల జాబితాపై ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 

మంత్రి వర్గం కూర్పులో ఎవరి ప్రమేయం లేకుండా ఆయన ముద్ర ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేలను కలవడం గానీ రికమండేషన్లకు జగన్ అవకాశం ఇవ్వకుండా చాలా వ్యూహాత్మకంగా అడుగుల వేస్తున్నారు. 

వైయస్ జగన్ తన కేబినెట్ ను దాదాపుగా ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇప్పటి వరకు 19 మంది మంత్రుల పేర్లను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మిగిలిన 6 మంది పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

నేడు జరగబోతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశంలో మంత్రుల జాబితాను జగన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 8 ఉదయానికల్లా మంత్రులు ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉండాల్సిన నేపథ్యంలో శాసన సభాపక్ష సమావేశంలోనే మంత్రుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 19 మంది మంత్రుల జాబితాను జగన్ రెడీ చేశారు. ఈ 19 మందిలో కొన్ని జిల్లాలకు ఒక్కొక్కరు చొప్పున మరికొన్ని జిల్లాలకు ఇద్దరకు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

వ.నెం.              మంత్రి పేరు                                  జిల్లా 
1.                  బొత్స సత్యనారాయణ                 విజయనగరం
2.                 ధర్మాన ప్రసాదరావు                     శ్రీకాకుళం
3.                 అవంతి శ్రీనివాస్                         విశాఖపట్నం
4.                 పిల్లి సుభాష్ చంద్రబోస్              తూర్పుగోదావరి
5.                 దాడిశెట్టి రాజా                            తూర్పుగోదావరి
6.                ముదునూరి ప్రసాదరాజు             పశ్చిమగోదావరి
7.                తెల్లం బాలరాజు                          పశ్చిమగోదావరి
8.               కొడాలి నాని                                 కృష్టా 
9.               ఆళ్ల రామకృష్ణారెడ్డి                      గుంటూరు
10.            మేకతోటి సుచరిత                        గుంటూరు 
12.            బాలినేని శ్రీనివాస్ రెడ్డి                  ప్రకాశం                            
13.            అనిల్ కుమార్ యాదవ్                నెల్లూరు
14            మేకపాటి గౌతం రెడ్డి                     నెల్లూరు
15.          పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి              చిత్తూరు
16.           బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి             కర్నూలు
17.           అనంత వెంకట్రామిరెడ్డి               అనంతపురం
18.           అంజద్ బాషా                             కడప
19.          కోరుముట్ల శ్రీనివాసులు                 కడప 

మెుదటి జాబితాలో పార్టీ విధేయులకు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి జగన్ తో ఉన్న వారికే ప్రాధాన్యత కల్పించారు. అలాగే పార్టీలో సీనియర్ నేతలకు కూడా అవకాశం ఇచ్చారు. జగన్ కేబినెట్ లో గతంలో మంత్రులుగా పనిచేసిన నలుగురికి ఛాన్స్ ఇచ్చారు.

దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రులుగా పని చేసిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు తమ మంత్రి పదవులు కోల్పోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios