Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ స్క్రీన్ పైకి నటుడు శివాజీ: ఈసారి టార్గెట్ ఇద్దరు సీఎంలు, మేఘాకృష్ణారెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా కృష్ణారెడ్డి చేతివాటం రూ.35వేల కోట్లు అని తేల్చి చెప్పారు శివాజీ. అందుకు సంబంధించి ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని వాటన్నింటిని బయటపెడతానన్నారు.  

Actor sivaji sensational comments on telugu states cm's, megha engineering krishnareddy
Author
Hyderabad, First Published Oct 3, 2019, 1:29 PM IST

హైదరాబాద్: ఆపరేషన్ గరుడ పేరుతో హల్ చల్ చేసిన సినీనటుడు శివాజీ మరోసారి తెరపైకి వచ్చారు. టీవీ9 కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు శివాజీ ఆనాటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న ఆయన తాజాగా మరోసారి స్క్రీన్ పైకి వచ్చారు. 

ఆపరేషన్ గరుడ పేరుతో బీజేపీ, ఏపీ రాజకీయాలు, కేంద్రం టార్గెట్ గా నటుడు శివాజీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి స్క్రీన్ పైకి వచ్చారు. వస్తూ వస్తూనే తెలుగు తన పంథా మార్చుకున్నారు. ఈసారి తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఇటీవలే ఏపీలో పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పనులను కైవసం చేసుకున్న మేఘా కృష్ణారెడ్డిపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. 

మేఘా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు నటుడు శివాజీ.  కృష్ణారెడ్డి మిత్ర ద్రోహి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మేఘాకృష్ణారెడ్డి అక్రమాలు అంటూ కీలక ఆధారాలతో వీడియో విడుదల చేశారు. త్వరలోనే మేఘా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు.  

మీడియా ద్వారా తాను ఈ విషయాలను బయటపెడదామనుకున్నానని అయితే వాటిని ప్రచారం చేసే దమ్ము, ధైర్యం దేశంలోని ఏ మీడియాకు లేదంటూ మీడియాపై కూడా విరుచుకుపడ్డారు.  

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకొని  ముఖ్యమంత్రులతో పంచుకోవడం చాలా పెద్ద దేశ ద్రోహమన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ప్రజా ధనాన్ని ముఖ్యమంత్రులు, కాంట్రాక్టర్లు దోచుకోవడం దేశ ద్రోహమంటూ కేసీఆర్ పై పరోక్షంగా పంచ్ లు విసిరారు. 

రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలతో బస్సులు కొని బస్సులతో వచ్చే ఆదాయాన్ని సొంత జేబుల్లోకి నింపుకోవడం నిఖార్సయిన దేశ ద్రోహమంటూ విరుచుకుపడ్డారు. ఓఎన్‌జీసీలోని 27 రిగ్గుల కాంట్రాక్టును దక్కించుకుని ప్రజాధనాన్ని లూఠీ చేయాలనుకుంటున్న దేశ ద్రోశం గురించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని తన వీడియోలో స్పష్టం చేశారు నటుడు శివాజీ. 

ఆ దేశ ద్రోహి, దేశానికి ముప్పుగా పరిణమించిన వ్యక్తి మేఘా కృష్ణారెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు నటుడు శివాజీ. కృష్ణారెడ్డి నడిపే సంస్థ పేరు మేఘా ఇంజనీరింగ్ అని చెప్పుకొచ్చారు. ఆ సంస్థ తన దృష్టిలో ఓ చైనాపీస్ అంటూ మండిపడ్డారు. 

గత 7 ఏళ్లలో ఆవ్యక్తి కంపెనీ ఆదాయం రూ.26వేల కోట్లకు వెళ్లిందంటేనే అర్థం చేసుకోవచ్చన్నారు. ఒక మిత్ర ద్రోహి గురించి నిజాలు తెలియాలన్న ఉద్దేశంతో కృష్ణారెడ్డి చేస్తున్న ఘోరాలు, దేశానికి చేస్తున్న నష్టాలను ప్రజల ముందు ఉంచుతానని చెప్పుకొచ్చారు. 

బీజేపీకి మేఘా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి తీవ్ర అన్యాయం చేస్తున్నారని శివాజీ ఆరోపించారు. కృష్ణారెడ్డి చేస్తున్న నష్టాన్ని, పోలవరం రివర్స్ టెండరింగ్, రిగ్గుల కాంట్రాక్టుపై సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతానని శివాజీ తన వీడియో సందేశంలో తెలిపారు. 

కృష్ణారెడ్డి ఎక్కడ నుంచి అయితే తన సామ్రాజ్యాన్ని విస్తరించాడో అదే రిగ్గుల కాంట్రాక్టు గురించి అసలు విషయాలు బయటపెడతానని చెప్పుకొచ్చారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన సంస్థ చేసిన ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారాన్ని కూడా ఆధారాలతో సహా బట్టబయలు చేస్తానని శివాజీ స్పష్టం చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా కృష్ణారెడ్డి చేతివాటం రూ.35వేల కోట్లు అని తేల్చి చెప్పారు శివాజీ. అందుకు సంబంధించి ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని వాటన్నింటిని బయటపెడతానన్నారు.  

ప్రస్తుతం తన ప్రాణాలకు హాని ఉన్నా తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదన్నారు. నాలుగు నెలలుగా తాను పడుతున్న వేధింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తమ జీవితాలను అతలాకుతలం చేసిన ఓ దుర్మార్గుడి గురించి చెప్పకపోతే భావితరాలు తమను క్షమించవని చెప్పుకొచ్చారు. 

దేశ భవిష్యత్తును కాపాడాలన్న ఉద్దేశంతో మేఘా ఇంజనీరింగ్ చేస్తున్న దోపిడీలను ఆధారాలతో సహా ప్రజల ముందకు తీసుకొస్తానని నటుడు శివాజీ స్పష్టం చేశారు. అయితే శివాజీ చేసిన వ్యాఖ్యలపట్ల అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం మరీ ముఖ్యంగా మేఘా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios